జగన్‌కు కూటమి పార్టీలే సాయం చేస్తున్నాయా..?
నేనున్నాను సినిమాలో ఓటమిని ఓదారుస్తూ సాగిన అద్భుతమైన పాట ఉంది….
ఈ పాట మీకు గుర్తు ఉండే ఉంటుంది….
ఆ పాటలో …
ప్రశ్నతో బదులే చెప్పెను…
ఓటమితో గెలిపే చెప్పెను…
నేనున్నానని… నీకేం కాదని…
నిన్నటి రాతను మార్చేస్తానని…
తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని…
తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకు వెళ్ళాలని…
అంటూ సాగిన ఆ పాట ఓటమి లో కొండంత బలాన్ని ఇస్తాయి….
ఆ పాట జగన్ విన్నారో లేదో కానీ కూటమి నాయకులు మాత్రం ఈ స్టోరీ చూసాక ఈ పాటని ఇంకో సారి గుర్తు చేసుకోవాల్సిందే….!!!
ఏపీ రాజకీయాల్లో కూటమి నాయకులే ఈ సూత్రాన్ని అక్షరాలా అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
జగన్.. నువ్వు ఓడిపోయినా,
నీకు 11 సీట్లే వచ్చినా..
నీకేం కాదని చెప్పడానికి మేమున్నాము..
నీ నిన్నటి రాతను
మేము మార్చేస్తాము
అంటూ ఒకరిపై ఒకరు పోటీ పడి మరి జగన్‌ను విమర్శల ద్వారా ఓదారుస్తూ, ఆయన రాజకీయంగా తిరిగి నిలదొక్కుకునేలా కూటమి నేతలే భరోసాగా నిలుస్తున్నారా? అన్న విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఒక సంచలనం. 2019లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆయన, 2024లో ఊహించని ఓటమిని చవిచూశారు. అయితే, ఈ ఓటమి తర్వాత రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన చర్చను లేవనెత్తుతున్నారు: దెబ్బలెన్ని తిన్నా జగన్‌లో మార్పు లేదు.. భవిష్యత్తులో రాదు అని కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం శత్రువులే జగన్‌ను మళ్లీ విజేతగా మారుస్తున్నారు అని అభిప్రాయపడుతున్నారు.
చారిత్రాత్మక పరాభవం.. వింత వ్యూహం…
రాష్ట్ర చరిత్రలో ఒకసారి రాష్ట్రాన్ని పాలించిన ఏ పార్టీకి ఎదురుకాని ఘోర పరాభవం 2024 ఎన్నికల్లో వైసీపీకి ఎదురైంది. కేవలం 11 సీట్లకే పరిమితమై, ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. అంతటి ఘోర ఓటమిని చవిచూసి, అధికారానికి ఆమడ దూరంలో ఉన్న వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్‌ను ఇంకా రోజువారీ ప్రచార అస్త్రంగా ఎంచుకోవడం ద్వారా కూటమి పార్టీలు పెద్ద తప్పు చేస్తున్నాయా? ఓడిపోయిన నాయకుడిని విస్మరించాల్సింది పోయి, ప్రతి రోజూ ఆయనే లక్ష్యంగా విమర్శలు గుప్పించడం వల్ల ఆయనకు లేని ప్రాధాన్యతను కల్పిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పాలనా శైలి – నేర్చుకున్న పాఠాలు…
ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారని, అభివృద్ధిని విస్మరించారనేది ప్రధాన విమర్శ. బటన్ నొక్కి డబ్బులు పంచితే చాలు, ప్రజలు ఓట్లు వేస్తారు అనే భ్రమలో ఆయన ఉన్నారని ప్రత్యర్థులు ఎద్దేవా చేశారు. దీనికి తోడు, పార్టీ ఎమ్మెల్యేలకు, కింది స్థాయి నాయకులకు ఆయన అందుబాటులో ఉండరు అనే అపవాదు గట్టిగా వినిపించింది. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యేకు జరిగిన పరాభవం ఈ వాదనలకు బలాన్ని చేకూర్చింది. అయితే, ఇక్కడే అసలైన రాజకీయ మలుపు దాగి ఉంది.
శత్రువే అసలైన గురువు…..
మన మిత్రుల కంటే శత్రువుల నుండే మనకు ఎక్కువ సమాచారం అందుతుంది. మనల్ని అభిమానించే వారు లోపాలను దాచవచ్చు కానీ, ద్వేషించే వారు ప్రతి చిన్న తప్పును భూతద్దంలో చూపిస్తారు. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో జగన్ విషయంలో ఇదే జరుగుతోంది. జగన్ వేసే ప్రతి అడుగును, మాట్లాడే ప్రతి మాటను తెలుగుదేశం పార్టీ మరియు దాని అనుబంధ సోషల్ మీడియా విభాగాలు నిశితంగా గమనిస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.
నిజానికి, ఈ విమర్శలే జగన్‌కు మేలు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తనపై విసిరిన ప్రతి విమర్శను, ప్రతి రాయిని ఆయన ఓర్పుగా ఒడిసి పట్టుకుని, తన భవిష్యత్ రాజకీయ సౌధానికి పునాది రాళ్లుగా మార్చుకుంటున్నారు. ప్రత్యర్థులు ఎత్తిచూపే లోపాలను సరిదిద్దుకుంటూ, తనను తాను పునఃసమీక్షించుకోవడానికి ఈ విమర్శలే ఆయనకు నిఘా నేత్రాలుగా పని చేస్తున్నాయి.
జగన్నామ్మస్మరణ… కూటమి నాయకుల ఉచిత ప్రచారం…?
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నాయకులు ముఖ్యమంత్రి నుండి కార్యకర్తల వరకు నిత్యం జగన్ నామస్మరణ చేయకుండా ఉండలేకపోతున్నారు. ప్రతి పథకం వైఫల్యానికి లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి జగనే కారణమని పదే పదే చెప్పడం ద్వారా, ప్రజల దృష్టిని నిరంతరం జగన్ మీదే ఉంచుతున్నారు. జగన్ తన దారిన తాను మౌనంగా ఉన్నప్పటికీ, కూటమి నాయకులే ఆయనను వార్తల్లో నిలుపుతున్నారు.
సొంత చెల్లెలు షర్మిల మొదలుకొని, కూటమి మంత్రుల వరకు అందరూ కలిసి ఒకే వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల సామాన్య ప్రజల్లో తెలియకుండానే ఒక సానుభూతి (Sympathy) మొదలయ్యే అవకాశం ఉంది. అంత ఘోరంగా ఓడిపోయినప్పటికీ, ఒక్క జగన్‌ను ఎదుర్కోవడానికి ఇంకా ఇంతమంది ఏకమవ్వాలా? అనే ప్రశ్న సామాన్యుల మెదడులో మెదులుతోంది.
మార్పు విజయ తీరాలకు చేరుస్తుందా?
జగన్ తన పాత పద్ధతులను వీడి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చి, ప్రత్యర్థులు చేసే విమర్శల్లోని వాస్తవాలను గ్రహించి ముందుకు సాగితే.. అది ఖచ్చితంగా మార్పుకు నాంది అవుతుంది. ఒక నాయకుడు తన తప్పులను దిద్దుకున్నప్పుడే విజయం తలుపు తడుతుంది.
ప్రస్తుతానికి కూటమి నాయకులు చేస్తున్న విమర్శలు జగన్‌కు పరోక్షంగా మేలు చేస్తున్నాయి. మరి ఈ జగన్నామ్మస్మరణ ఇలాగే కొనసాగిస్తారో లేక తమ వైఖరి మార్చుకుంటారో అనేది కూటమి నాయకులకే వదిలేయాలి. కానీ ఒకటి మాత్రం నిజం: ప్రత్యర్థుల విమర్శలే రాబోయే కాలంలో జగన్ విజయానికి బలమైన ఇంధనంగా మారతాయా.. లేదా అన్నది వేచి చూడాలి.
ఎడిటర్.