స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి – రాష్ట్ర ఎన్నికల కమిషనర్
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్, కౌంటింగ్, శాంతిభద్రతలపై సమీక్షించారు. నవంబర్ 26న మొదటి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ ఉదయం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉపసంహరించేందుకు ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అవసరమైన సిబ్బంది, అదనపు కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసి పారదర్శకంగా ఫలితాలు ప్రకటించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐజీ రాజకుమారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మల్లికార్జున్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు.