రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక ట్రాఫిక్ డైరెక్టరేట్…
అమల్లోకి రానున్న ఆధునిక ట్రాఫిక్ పర్యవేక్షణ వ్యవస్థ.. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక విభాగం
పొలిటికల్ టెంపర్, అమరావతి :
ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మరణాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రత్యేకంగా డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ (డీటీఎంఆర్ఎస్)ను ఏర్పాటు చేస్తూ హోంశాఖ జీవో జారీ చేసింది. పోలీస్ ప్రధాన కార్యాలయం కేంద్రంగా ఈ ప్రత్యేక విభాగం పనిచేయనుంది.
ఈ నూతన విభాగం ద్వారా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, రోడ్డు ప్రమాదాలపై శాస్త్రీయ విశ్లేషణ చేపట్టనున్నారు. జాతీయ రహదారులపై నిరంతర పెట్రోలింగ్ నిర్వహించడం, ట్రాఫిక్ నిబంధనలను రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతిగా అమలు చేయడం వంటి కీలక బాధ్యతలను ఈ డైరెక్టరేట్ పర్యవేక్షించనుంది.
ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇందుకోసం పోలీస్, రవాణా, రోడ్లు భవనాల శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పెంచనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లనున్నారు.
మరోవైపు ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటు కోసం కొత్త పోస్టులు, భవనాలు సృష్టించకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందితోనే కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, విలువైన ప్రాణాలను కాపాడటం, రాష్ట్రంలో రహదారి భద్రతను మెరుగుపరచడం ఈ నూతన డైరెక్టరేట్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.