పల్నాడు జిల్లాలో నవంబర్ 26న జరగనున్న తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పోస్టల్ బ్యాలెట్లు, ఓటర్ స్లిప్పుల పంపిణీ, వెబ్‌కాస్టింగ్, పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, ఓటర్ల ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు తదితర సౌకర్యాలపై సమీక్షించారు. బ్యాలెట్ పత్రాల భద్రత, స్ట్రాంగ్ రూమ్‌లు, పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని సూచించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. కౌంటింగ్ సమయంలో ప్రతి రౌండ్ ఫలితాలను జాగ్రత్తగా నమోదు చేయడంతో పాటు స్వల్ప మెజారిటీ ఉన్న పంచాయతీల్లో చెల్లని ఓట్ల పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.