కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత…
ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతుందన్న జగన్…
పాదయాత్రకు సిద్ధమవుతున్నానని వెల్లడి…
వైయస్ జగన్ మాటలతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. వై . ఎస్ . జగన్మో హన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని స్పష్టం చేశారు.
“ప్రతి ఇంట్లో ఇప్పుడు ఒకటే చర్చ… జగన్ ఉన్నప్పుడు అన్నీ వచ్చాయి, ఇప్పుడు ఎందుకు రావడం లేదు?” అంటూ ప్రస్తుత పాలనపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3.30 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, కానీ ఒక్క సంక్షేమ లేదా అభివృద్ధి పథకం కూడా అమలు చేయలేదని జగన్ ఆరోపించారు. తన పాలనలో మాత్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రూ.2.73 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. అప్పులు చేస్తూ ప్రజలకు మేలు చేయకపోవడం వల్లే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని ఆయన అన్నారు.
ప్రస్తుత పాలన పూర్తిగా అవినీతితో నిండిపోయిందని జగన్ తీవ్రంగా విమర్శించారు. ఇసుక, మట్టి, మద్యం, ఖనిజ వనరులు అన్నీ దోపిడీకి గురవుతున్నాయని, ప్రభుత్వ భూములను కూడా అడ్డగోలుగా ఇస్తున్నారని ఆరోపించారు. “ఇది పాలన కాదు… దోచుకో, పంచుకో, తినుకో అనే వ్యవస్థగా మారిపోయింది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి కారణం కూడా ఇదేనని పేర్కొన్నారు.
డ్రగ్స్ కేసులు, మహిళలపై వేధింపుల ఆరోపణలు వంటి సీరియస్ అంశాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జగన్ విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు ఉన్నప్పటికీ ‘నో యాక్షన్’ పాలసీ అమలు చేస్తున్నారని, ఇది ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేస్తోందని అన్నారు. ప్రజల భద్రత, మహిళల రక్షణపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
విద్య, వైద్యం, రైతు సంక్షేమం వంటి కీలక రంగాల్లో కూడా తీవ్ర వెనుకబాటు ఏర్పడిందని జగన్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ అమలు సరిగా లేదని, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు కనిపించడం లేదని, రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత బీమా, గిట్టుబాటు ధరలు అందడం లేదని చెప్పారు. పేదలు, మహిళలు, రైతుల కోసం ఆలోచించే మైండ్సెట్ ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
రాబోయే రాజకీయ వ్యూహాన్ని కూడా జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు. మరో ఏడాదిన్నరలో పాదయాత్ర ప్రారంభించి, దాదాపు ఏడాది పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. కార్యకర్తలు కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. “జగన్ 2.0లో కార్యకర్తలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది” అని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక నాయకత్వానికి కూడా జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. చుండూరి రవిబాబుకు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు ప్రకటించగా, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పనితీరును ప్రశంసించారు. “ఇది నా పార్టీ కాదు… మనందరి పార్టీ” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
తన పాలనను గుర్తు చేస్తూ, మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. మొత్తం మీద తాడేపల్లి సమావేశం ద్వారా ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర దాడి చేయడంతో పాటు, రాబోయే రాజకీయ పోరాటానికి జగన్ సంకేతాలు ఇచ్చినట్లుగా స్పష్టమైంది.