తమిళనాట ‘దళపతి’ పోరు….
చరిత్ర పునరావృతమా…?
సరికొత్త అధ్యాయమా…?
విజయ్ రాజకీయ ప్రస్థానంపై దేశవ్యాప్తంగా ఆసక్తి…
తమిళనాడు రాజకీయాల్లో సినిమా గ్లామర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వెండితెర వేల్పులకు గుడి కట్టే నేల మీద, ఆ ఆరాధ్య భావాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడం మాత్రం ఆషామాషీ వ్యవహారం కాదని చరిత్ర పదే పదే గుర్తు చేస్తోంది. ఇప్పుడు దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో 2026 ఎన్నికల క్షేత్రంలోకి ‘ఒంటరి పోరు’కు సిద్ధమవ్వడం అటు కోలీవుడ్ నుంచి ఇటు కోట వరకు పెను సంచలనం సృష్టిస్తోంది.
60 ఏళ్లుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ ముప్పై ఏళ్ల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టి విజయ్ సింహాసనాన్ని అధిష్ఠిస్తారా? లేక గతంలో కెప్టెన్ విజయకాంత్ మాదిరిగా కింగ్ మేకర్ స్థాయికే పరిమితమవుతారా? అన్న ఉత్కంఠ ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొంది.
విజయకాంత్ ‘కెప్టెన్’ మార్క్ పాలిటిక్స్: ఒక గుణపాఠం
గతంలో కెప్టెన్ విజయకాంత్ స్థాపించిన డీఎండీకే (DMDK) ప్రస్థానాన్ని పరిశీలిస్తే, సినీ గ్లామర్ అనేది రాజకీయ విజయానికి కేవలం ఒక ఎంట్రీ పాస్ మాత్రమేనని అర్థమవుతుంది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ ఒంటరిగా బరిలోకి దిగి సుమారు 8.4 శాతం ఓట్లను కొల్లగొట్టి రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఒక్కరే గెలిచినప్పటికీ, అనేక నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించే స్థాయికి ఎదిగారు.
ఆ తర్వాత 2011లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఏకంగా 29 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష నేత హోదాను దక్కించుకున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో పటిష్టమైన కార్యకర్తల వ్యవస్థ లేకపోవడం, కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం మరియు సరైన రాజకీయ వ్యూహాలు లోపించడం వల్ల ఆ విజయాన్ని ఆయన సుస్థిరం చేసుకోలేకపోయారు.
2016 నాటికి ఆయన ఓటు బ్యాంకు 2.4 శాతానికి పడిపోవడం, ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం సినీ స్టార్ల రాజకీయ వైఫల్యానికి ఒక నిదర్శనంగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల సినీ-రాజకీయ అనుభవాలు..
ఇదే తరహా పరిస్థితులను మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ గమనించవచ్చు. 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీతో వచ్చినప్పుడు రాష్ట్రమంతా ఒక ఊపు ఊగింది. సుమారు 18 శాతం ఓట్లను సాధించినప్పటికీ, కేవలం 18 సీట్లకే పరిమితం కావడం సినీ అభిమానాన్ని ఓటు బ్యాంకుగా మార్చడంలో ఉన్న సంక్లిష్టతను చాటిచెప్పింది.
అలాగే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ భారీ స్థాయిలో యువతను ఆకట్టుకున్నప్పటికీ, గ్రామస్థాయిలో ఓటర్లను పోలింగ్ బూత్ వరకు నడిపించే యంత్రాంగం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఈ ఇద్దరు అగ్ర హీరోల వైఫల్యానికి ప్రధాన కారణం సినిమా క్రేజ్‌ను రాజకీయ బలంగా మార్చడంలో అవసరమైన ‘స్థానిక పట్టు’ మరియు ‘బూత్ లెవల్ మేనేజ్మెంట్’ లేకపోవడమే.
విజయ్ ముందున్న సవాళ్లు.. సర్వేల అంచనాలు
ప్రస్తుత రాజకీయ సమీకరణాలను గమనిస్తే, విజయ్ పార్టీకి దాదాపు 18 నుంచి 22 శాతం వరకు ఓట్లు సాధించే పట్టు ఉందని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది ఒక కొత్త పార్టీకి ఆశాజనకమైన పరిణామమే అయినప్పటికీ, దశాబ్దాల చరిత్ర ఉన్న డీఎంకే, అన్నా డీఎంకే వంటి క్యాడర్ బేస్డ్ పార్టీలను ఢీకొట్టడం అంత సామాన్యమైన విషయం కాదు. ఎంజీఆర్, జయలలిత వంటి వారు కేవలం గ్లామర్‌తోనే కాకుండా, మధ్యాహ్న భోజన పథకం, అమ్మ క్యాంటీన్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చి వారి గుండెల్లో దేవుళ్లుగా నిలిచిపోయారు. ఇప్పుడు విజయ్ కూడా కేవలం ఫ్యాన్ బేస్‌పైనే కాకుండా, ఓటర్ల నమ్మకాన్ని గెలుచుకునే బలమైన మేనిఫెస్టో మరియు సిద్ధాంతంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
కోలీవుడ్ నుంచి కోట వరకు..
తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను భర్తీ చేసేందుకు విజయ్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆయన తీసుకున్న ఒంటరి పోరు నిర్ణయం ఆయన ఆత్మవిశ్వాసాన్ని చాటుతున్నప్పటికీ, అది ఆయనను అధికార పీఠానికి చేరువ చేస్తుందా లేక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా నిలబెడుతుందా అన్నది తేలాల్సి ఉంది.
విజయ్ ప్రస్థానం చిరంజీవి, పవన్ కళ్యాణ్, విజయకాంత్ మాదిరిగానే సాగుతుందా లేక వారి కంటే భిన్నంగా కొత్త చరిత్ర సృష్టిస్తుందా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా, దళపతి పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట పొలిటికల్ టెంపర్ పీక్స్‌కు చేరింది.
ఎడిటర్
TSR YADAV