రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ జగన్ జపమే చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. వినుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బొల్లా బ్రహ్మనాయుడు కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
అమరావతి రాజధాని కాదని వైసీపీ గాని వైసీపీ నాయకులు గానీ ఎవరైనా చెప్పారా అని బొల్లా బ్రహ్మనాయుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడమే జగన్మోహన్ రెడ్డి అభిమాని అదే వైసీపీ విధానమని స్పష్టం చేశారు బ్రహ్మనాయుడు. రాజధానికి చట్టబద్ధత అంటూ అసెంబ్లీలో ఐదు గంటల పాటు కూటమి నాయకులు మంత్రులు శాసనసభ్యులు జగన్ జపమే చేశారని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి రాడు అని అంటూనే వచ్చినా రాజధాని మార్చకుండా చట్ట సవరణ బిల్లు తెస్తున్నామని కూటమి చెప్పడం వారి అభద్రతాభావానికి నిదర్శనమని బ్రహ్మనాయుడు వ్యాఖ్యానించారు.
అమరావతి పేరుతో వేల ఎకరాలు దోచుకుని రైతులకు అన్యాయం చేసిన నాయకులు అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైన కట్టారా, ఏ నిర్మాణాలు కట్టడాలు లేని చోట అవుటర్ రింగ్ రోడ్డు అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నించారు బొల్లా. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేశారో చూసామని, 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తున్నా అమరావతి లో అభివృద్ధి ఏమి జరగలేదని.. తమ ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం, తమ వ్యాపారాలు బాగు చేసుకోవడం కోసం అమరావతి పేరు చెప్పి గ్రాఫిక్స్ చూపిస్తున్నారని మండిపడ్డారు.
మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను పట్టించుకోవడంలేదని బొల్లా విమర్శించారు. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలు అంటూ ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోర వైఫల్యం చెందిందన్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలు పెరిగిపోతున్నాయని ఎక్కడ దోపిడీ చూసినా తెలుగుదేశం నాయకుల పాత్ర ఉంటుందని తెలుగుదేశం నాయకులు లేనిదే దోపిడీ లేదని ధ్వజమెత్తారు బొల్లా. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. భూములు ఆక్రమించుకునేది టిడిపి నాయకులే… భూములకు బోర్డులు పెట్టేది టిడిపి నాయకులే… పోలీసులు మాదిరిగా పెత్తనం చెలాయిస్తున్నది టిడిపి నాయకులను అంటూ ఘాటుగా విమర్శించారు బ్రహ్మనాయుడు.
కూటమి ప్రభుత్వం అమరావతి రైతాంగానికి తక్షణమే న్యాయం చేయాలని గతంలో ప్లాట్లు ఇచ్చిన రైతులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు ఏవి అమలు కావడం లేదని, కూటమి ప్రభుత్వం దోపిడీలు మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు బొల్లా.
టిడిపి నాయకులే వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకొని అధికారులే లేకుండా పరిపాలించాలని ప్రయత్నిస్తున్నారని, ప్రజలకు ఎక్కడ న్యాయం జరగడం లేదని అన్నారు.
ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి జపం మాని ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పని చేయాలని సలహా ఇచ్చారు. మరో మూడేళ్లు పోతే జగన్మోహన్ రెడ్డి వస్తారని, టిడిపి నాయకులు అరాచకాలు అప్పుడు బయట పడతాయని హెచ్చరించారు.