అమరావతి… కమరావతి…. సాయి రెడ్డి లాజికల్ సెటైర్..!

ఎట్టకేలకు అమరావతికి చట్టబద్ధత లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో అమరావతికి చట్టబద్ధత తీసుకుని వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు నాయకులు తమదైన శైలిలో స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విమర్శలో తనదైన ముద్ర వేసుకున్న మాజీ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి అమరావతి విషయంపై లాజికల్ సెటైర్ తో ప్రభుత్వానికి.. స్ట్రాంగ్ కౌంటర్… డైరెక్షన్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పిస్తున్న వేళ, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలోనూ చేరకుండా తటస్థంగా ఉంటున్న సాయిరెడ్డి, ఇప్పుడు అమరావతిపై తన గళం వినిపించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.
పార్టీ లైన్‌కు భిన్నంగా.. ఒకప్పటి సన్నిహితుడి భిన్న స్వరం!
వైసీపీ పార్లమెంట్లో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయగా, ఒకప్పుడు ఆ పార్టీలో నంబర్-2 గా ఉన్న విజయసాయిరెడ్డి మాత్రం దీనికి మద్దతుగా నిలవడం విశేషం. అమరావతిని రాజధానిగా ప్రకటించడం వల్ల రాష్ట్రంలో ఉన్న రాజకీయ అనిశ్చితికి తెరపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ బంధనాల నుంచి బయటపడిన తర్వాత ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు, అమరావతిపై ఆయనకున్న వ్యక్తిగత సానుకూలతను స్పష్టం చేస్తున్నాయి.
రైతు పక్షపాతిగా కొత్త అవతారం…?
అమరావతికి మద్దతు తెలుపుతూనే, ఆయన పెట్టిన నిబంధనలు చర్చనీయాంశమవుతున్నాయి:
* న్యాయబద్ధమైన పరిహారం: 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్.
* హామీల అమలు: రైతులకు ఇచ్చిన ప్లాట్లు, కౌలు చెల్లింపులపై స్పష్టత ఉండాలని కోరారు.
* సమ్మిళిత అభివృద్ధి: రాజధాని కేవలం ఒక వర్గానికే పరిమితం కాకూడదని సూచించారు.
“మీరు కట్టేది అమరావతే తప్ప, కమరావతి కాకుండా చూచుకోండి. తస్మాత్ జాగ్రత్త!” అంటూచంద్రబాబు నాయుడుకి సాయి రెడ్డి ఇచ్చిన ఈ హెచ్చరిక, గతంలో ఆయన చేసిన ఆరోపణలను గుర్తు చేస్తూనే, ప్రస్తుత ప్రభుత్వంపై నిఘా ఉంచుతాననే సంకేతాన్ని ఇచ్చింది.
వైసీపీకి దూరమైన తర్వాత విజయసాయిరెడ్డి తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అమరావతిని సమర్థించడం ద్వారా రాజధాని ప్రాంత ప్రజలకు దగ్గరవ్వాలని, అదే సమయంలో లోపాలను ఎత్తిచూపుతూ అధికార కూటమిని ఇరుకున పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక మాజీ ఎంపీ అభిప్రాయమా లేక భవిష్యత్తులో ఆయన తీసుకోబోయే రాజకీయ నిర్ణయానికి పునాదా? అన్నది వేచి చూడాలి.
చివరిగా విజయ్ సాయి రెడ్డి లాజికల్‌గా సెటైర్ వేసిన… అమరావతి కి మద్దతు తెలిపినా… అమరావతిని ఒక సామాజిక వర్గానికి కేంద్ర బిందువుగా మార్చకుండా అన్ని సామాజిక వర్గాల కు ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాల ప్రజలకు అమరావతి రాజధానిగా నిలవాలి అని విజయ్ సాయి రెడ్డి ఆకాంక్షించినట్లుగా చెప్పవచ్చు.