
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మళ్లీ వేడెక్కుతోంది. అమరావతి విషయంలో తన వైఖరిని తెలియజేస్తూ జగన్ పేల్చిన “మావిగన్” తూటాలు పెను సంచలనంగా మారాయి. అమరావతి అభివృద్ధికి అడ్డు కాదు అని చెబుతూ, మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉన్నాం అంటూనే తెరపైకి కొత్త ప్రతిపాదనలు తెచ్చారు జగన్.
మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (MAVIGUN) ప్లాన్ ఒకవైపు చర్చకు దారి తీస్తుండగా… మరోవైపు అమరావతి రాజధాని అంశంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన నిర్ణయాలు ఈ కథనాన్ని మరింత కీలక దశకు తీసుకెళ్లాయి.
ఇటీవల అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా కొనసాగించేలా చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందడమే కాకుండా, పార్లమెంట్ స్థాయిలో కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం ఇప్పుడు రాజకీయంగా పెద్ద మైలురాయిగా మారింది. అంటే ప్రస్తుతం చట్టపరంగా అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న విషయం స్పష్టంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి వచ్చే రెండున్నర ఏళ్లు అత్యంత కీలకం.
కూటమి ప్రభుత్వానికి ఇదే లిట్మస్ టెస్ట్…
చట్టం తమ వైపు ఉన్న ఈ సమయంలో… కూటమి ప్రభుత్వం అమరావతిలో వాస్తవంగా ఎంతవరకు నిర్మాణాలు పూర్తి చేస్తుంది?
ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు, పెట్టుబడులు ఇవి ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్తారు? అన్నదే ప్రజల ముందు నిలిచిన పెద్ద ప్రశ్న.
ఇప్పటికే అమరావతి పేరుతో భూసేకరణ చేసిన రైతులు, అభివృద్ధి కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రజలు ఇప్పుడు నిజమైన పనులు మొదలవుతాయా? లేక మళ్లీ హామీలకే పరిమితమవుతాయా? అన్న అనుమానాల్లో ఉన్నారు.
జగన్ ‘మావిగన్’—వ్యూహాత్మక సంకేతమా?
ఈ సమయంలోనే జగన్ తీసుకొచ్చిన మావిగన్ కాన్సెప్ట్ రాజకీయంగా చాలా అర్థవంతంగా కనిపిస్తోంది. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు నగరాలను కలిపి గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్న ఈ ఆలోచన… అమరావతి కేంద్రంగా ఉన్న అభివృద్ధి మోడల్‌కు ప్రత్యామ్నాయం చూపించడమేనా? అన్న చర్చ మొదలైంది.
జగన్ వాదన ప్రకారం అమరావతిపై భారీగా ఖర్చు పెట్టడం కంటే, ఇప్పటికే ఉన్న మూడు ప్రధాన నగరాలను కలిపి అభివృద్ధి చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఇది కేవలం ఆర్థిక వాదన మాత్రమే కాదు… రాజకీయంగా కూడా ప్రాంతీయ సమతుల్యతపై దృష్టి పెట్టే ప్రయత్నంగా చూస్తున్నారు.
జగన్ వస్తే అమరావతి భవితవ్యం?
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది.
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి కొనసాగుతుందా? లేక ప్రాధాన్యత తగ్గుతుందా?
గత అనుభవాలను చూసిన అమరావతి రైతులు, స్థానికులు ఇప్పుడు మరింత ఆందోళనలో ఉన్నారు. మూడు రాజధానుల ఆలోచన, అమరావతి పనులు నిలిపివేత వంటి పరిణామాలు మళ్లీ పునరావృతమవుతాయా? అన్న భయం వ్యక్తమవుతోంది.
అదే సమయంలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా రాజకీయ స్థిరత్వాన్ని గమనిస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే అభివృద్ధి దిశ కూడా వారి విధానాలకే పరిమితం అవుతుందనే అభిప్రాయం బలపడుతోంది.
చట్టం ఒకటి… రాజకీయాలు మరొకటి…
చట్ట సవరణతో అమరావతి రాజధాని హోదా బలపడినా… రాజకీయ మార్పులతో విధానాలు మారిపోవడం అసాధారణం కాదు. “చట్టం అధికారంలో ఉన్నవారికి చుట్టం” అన్న సామెత ఇక్కడ మళ్లీ గుర్తుకు వస్తోంది.
కూటమి ప్రభుత్వం చెప్పే అభివృద్ధి హామీలపై పూర్తిగా నమ్మకం ఉంచాలా?
లేక జగన్ చూపిస్తున్న ప్రత్యామ్నాయ మోడల్ వైపు దృష్టి మళ్లించాలా? అన్నది ఇప్పుడు ప్రజల ముందున్న అసలు నిర్ణయం.…
అమరావతి కథ కొత్త మలుపులోకి…
ఒకవైపు చట్టబద్ధతతో ముందుకు వెళ్తున్న అమరావతి…
మరోవైపు ‘మావిగన్’ రూపంలో కొత్త ఆలోచనను ముందుకు తెస్తున్న జగన్…ఈ రెండు మార్గాల మధ్య ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశ నిర్ణయమవుతుందా?
లేక మళ్లీ రాజకీయాల గాలివానలో కథ మొదటికి వస్తుందా?
ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టం
అమరావతి రాజధాని కథ ఇంకా ముగియలేదు… ఇప్పుడే కొత్త అధ్యాయం మొదలైంది.
చివరిగా ఒక్క మాట…
మూడు రాజధానులు అంటూనే ప్లాన్ బి పేరుతో మావిగన్ అస్త్రాన్ని జగన్ తెరమీదకు తేవడం వెనక.. జగన్ భవిష్యత్తు వ్యూహం కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. అమరావతి రైతులకు తన నిర్ణయం కొంత వ్యతిరేకత అయినప్పటికీ, మావిగన్ అంటూ మచిలీపట్నం విజయవాడ గుంటూరు ప్రజల మన్ననలు పొందేందుకు, వారి మద్దతు తనకి లభించేలా వ్యూహాత్మకంగానే ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారు అని “పొలిటికల్ టెంపర్” అంచనా వేస్తోంది.