అమరావతికి రాష్ట్రపతి ఆమోదం..
సీఎం చంద్రబాబు హర్షం..

ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత లభించింది. ద్రౌపది ముర్ము ఆమోదంతో ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం, 2026 అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
ఈ పరిణామంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ఇది రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిన రోజు అని పేర్కొన్నారు.
“ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అమరావతి చట్టానికి ఆమోదం తెలపడం ద్వారా మా కలను నిజం చేశారు” అని చంద్రబాబు తన పోస్టులో వెల్లడించారు.
అలాగే, రాష్ట్ర అభివృద్ధికి అండగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలు, రాష్ట్ర నాయకులు, అలాగే అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి పౌరుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.
“ఇది కేవలం ప్రభుత్వ విజయం కాదు… ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. ముఖ్యంగా అమరావతి రైతుల త్యాగాలకు లభించిన గౌరవం” అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధి పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అంశంపై ఉన్న అనిశ్చితి తొలగిపోవడంతో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.