తొలి రాజధాని అమరావతి…
చారిత్రక వైభవం నుండి ఆధునిక రాజకీయ కేంద్రబిందువు వరకు…

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరావతి, కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, అది వేల ఏళ్ల చరిత్రకు మరియు కోట్లాది మంది ఆకాంక్షలకు సజీవ సాక్ష్యం.
క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలోనే శాతవాహనుల కాలంలో ‘ధాన్యకటకం’ పేరుతో దక్షిణ భారతదేశానికే తొలి రాజధానిగా విరాజిల్లి, ఆచార్య నాగార్జునుడి పాదస్పర్శతో ప్రపంచ స్థాయి బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందిన ఈ పుణ్యభూమి, నేడు నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు దిక్సూచిగా మారింది.
కృష్ణా నదీ తీరాన అమరలింగేశ్వర స్వామి కొలువుదీరిన ఆధ్యాత్మిక నగరం కావడమే కాకుండా, ప్రకృతి ఒడిలో పచ్చని పొలాలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ ప్రాంతం ఒక ‘గ్రీన్ సిటీ’గా రూపుదిద్దుకుంటోంది.
2014లో రాష్ట్ర విభజన అనంతరం, అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఆనాటి చారిత్రక ప్రాభవాన్ని పునరుద్ధరించడమే. అయితే, గత దశాబ్ద కాలంగా అమరావతి ప్రస్థానం అనేక రాజకీయ ఒడిదుడుకులకు లోనైంది.
తమ భూములను రాజధాని కోసం స్వచ్ఛందంగా ధారపోసిన సుమారు 29 వేల మంది రైతుల అపూర్వ త్యాగం ప్రపంచ చరిత్రలోనే అరుదైనది. గత ఐదేళ్లుగా ‘ఏకైక రాజధాని’గా అమరావతిని నిలబెట్టుకోవడానికి జరిగిన సుదీర్ఘ ఉద్యమాలు న్యాయ పోరాటాలు ఈ ప్రాంతాన్ని రాష్ట్ర మరియు జాతీయ రాజకీయాలకు ప్రధాన కేంద్ర బిందువుగా మార్చాయి.
అమరావతి నిర్మాణంలోనూ, దానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే సంకల్పంలోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్ర మరువలేనిది.
అమరావతిని ఒక కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ‘జ్ఞాన నగరం’గా (Knowledge City), ఆర్ధిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే విజన్‌తో ఆయన ‘ల్యాండ్ పూలింగ్’ (Land Pooling) వంటి వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టి వేల ఎకరాల భూమిని సేకరించారు.
ప్రపంచ దేశాల అగ్రశ్రేణి డిజైన్లతో, భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన వేసిన పునాదులు నేటికీ అమరావతికి వెన్నెముకగా ఉన్నాయి.
గడచిన ఐదేళ్ల గడ్డు కాలంలో రాజధానిపై అనేక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, తన పట్టుదలతో అటు ప్రజల్లో, ఇటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.
రాజకీయ పార్టీల వైఖరిని గమనిస్తే, తెలుగుదేశం పార్టీ (TDP) అమరావతిని ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించేందుకు దృఢ సంకల్పంతో ఉండగా, ప్రస్తుత కూటమి భాగస్వాములైన జనసేన మరియు బీజేపీలు కూడా దీనికి పూర్తి మద్దతు ప్రకటించాయి.
మరీ ముఖ్యంగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు సిద్ధమవ్వడం ఒక చారిత్రాత్మక ఘట్టం. దేశంలో ఒక రాష్ట్ర రాజధానికి కేంద్రం ఇలా చట్టబద్ధత కల్పించడం ఇదే మొదటిసారి.
దీనికి విరుద్ధంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ‘మూడు రాజధానుల’ పేరుతో వికేంద్రీకరణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి అమరావతి ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రజల మద్దతు మరియు న్యాయస్థానాల తీర్పులు అమరావతికే అనుకూలంగా నిలిచాయి.
రాష్ట్ర అసెంబ్లీలో త్వరలో ప్రవేశపెట్టబోయే ప్రత్యేక తీర్మానం మరియు కేంద్రం చేయబోయే చట్టం ద్వారా, భవిష్యత్తులో మరెవరూ రాజధానిని కదిలించే అవకాశం లేకుండా అమరావతికి శాశ్వత రక్షణ లభించనుంది. ఈ పరిణామాలన్నీ అమరావతిని అటు ఆధ్యాత్మికంగా, ఇటు రాజకీయంగా మరియు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా, దేశానికే ఒక కీలకమైన నగరంగా తీర్చిదిద్దుతున్నాయి.