గ్రామ పంచాయతీల్లో కొత్త అధ్యాయం
స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ పాలనలో కీలక మలుపు తిరిగింది. గత ఐదేళ్లుగా గ్రామాల్లో పరిపాలన సాగించిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియడంతో, ఏప్రిల్ 3 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభమైంది. ప్రభుత్వం విడుదల చేసిన G.O.Ms.No.47 ప్రకారం, కొత్త ఎన్నికలు జరిగే వరకు గ్రామాల పరిపాలన బాధ్యతలను అధికార యంత్రాంగం స్వీకరించింది.
అధికార యంత్రాంగం చేతిలో గ్రామ పాలన…
ఇకపై గ్రామాల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలు స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో సాగనున్నాయి. తహశీల్దార్లు, ఎంపీడీఓ వంటి అధికారులు ఈ బాధ్యతలు చేపట్టనుండగా, అవసరమైతే ఇతర గెజిటెడ్ అధికారులను కూడా నియమించే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. పంచాయతీ నిధుల వినియోగం నుంచి చెక్కులపై సంతకాల వరకు అన్ని అధికారాలు ఇప్పుడు ఈ అధికారులకే కేంద్రీకృతమయ్యాయి.
ఎన్నికల వరకు తాత్కాలిక వ్యవస్థ….
సాధారణంగా పంచాయతీ పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 4-5 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ లోపు గ్రామాల్లో పరిపాలనలో ఎటువంటి అంతరాయం రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ తాత్కాలిక విధానాన్ని అమలు చేసింది.
మాజీ సర్పంచుల రాజకీయ సమీకరణాలు…
పదవీకాలం ముగియడంతో సర్పంచులు, వార్డు సభ్యులు ఇప్పుడు అధికారికంగా మాజీ ప్రజాప్రతినిధులయ్యారు. అయితే రాజకీయంగా వీరి ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ స్థాయిలో మళ్లీ ప్రజలతో కలిసిపోవడం, తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇప్పటికే చురుకుగా కదులుతున్నారు.
వేడెక్కనున్న గ్రామ రాజకీయాలు…
ఇకపై గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశముంది. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి వర్గీకరణల వరకు అన్ని అంశాల్లో కసరత్తు ప్రారంభమైంది. వేసవి కాలం మరింత వేడెక్కినట్లే, గ్రామ రాజకీయాలు కూడా అదే స్థాయిలో ఉత్కంఠభరితంగా మారనున్నాయి.