
క్రమశిక్షణ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలైనా పార్టీ కార్యక్రమాలైనా ఎమ్మెల్యేలు చురుగ్గా ఉండాల్సిందే అన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన.
కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నందున రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సర్వే చేయించినట్లు సమాచారం.
సర్వే నివేదికలు ఆధారంగా ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ లు ఇస్తున్నామని, గ్రేడింగ్ లో వెనకబడిన ఎమ్మెల్యే లు పని తీరు మార్చుకోవాలని, నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, పార్టీ కార్యకర్తలు కార్యకర్తలకు అండగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికలతో సరిపెడుతున్నారా అనుకుంటే అంతటితో ఆగటం లేదు చంద్రబాబు. మరో నెల రోజులు గడిచినా తరువాత పనితీరు మెరుగుపడిందా లేదా అని అంతర్గత సర్వే నిర్వహించి సీల్డ్ కవర్లో నివేదిక సిద్ధం చేసి ఎమ్మెల్యేలను పిలిచి సీల్డ్ కవరు వారి చేతిలో పెడుతున్నారట. సీల్డ్ కవర్ చూసుకుని ఉక్కపోతతో ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని సమాచారం. జిల్లా కేంద్రాల్లోనూ, హైదరాబాదులోనూ, లేదా వారి వ్యక్తిగత వ్యాపారాల కోసము నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోతే ఆ సమాచారం తనకు వెంటనే వస్తుందని… అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను… అని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు చెప్పడంతో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.కాగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశాక రెండు సంవత్సరాల తరువాత పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పడంతో ఎంతోమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో సీల్డు కవర్ పేరుతో చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు నాయుడుని చూసి వణికి పోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.