26 వేలకోట్లతో జలజీవన్ మిషన్( JJM)…
ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి
– పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన చీఫ్ విప్ జీవి, ఎంపీ లావు

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం జల జీవన్ మిషన్ (JJM) ద్వారా 26 వేల కోట్లు ఖర్చు చేస్తుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు తెలిపారు. ఈపూరు మండలంలోని పలు గ్రామాల్లో పూర్తిచేసిన అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు.
అనంతరం చిట్టాపురం గ్రామంలో రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య కేటాయించిన 20 లక్షలు నిధులు ద్వారా నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ వాళ్లను వారు ప్రారంభించి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఇంటింటికి త్రాగునీటి కులాయి ఏర్పాటుచేసి సురక్షితమైన త్రాగునీరు అందిస్తామని తెలిపారు. జల జీవన్ మిషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కులాయి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని, దానిలో భాగంగానే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఇంటింటికి కులాయి ఏర్పాటు చేసి స్వచ్ఛమైన త్రాగునీరం ఇవ్వటం జరుగుతుందని, ఏడాదిలో పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
గ్రామ సీమలను అభివృద్ధి చేసే బాధ్యత సీఎం చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ కు అప్పగించగా 4500 కోట్లతో 3000 గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి లో దూసుకుపోతుందన్నారు.
23 లక్షల కోట్లు రాష్ట్రానిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని, దీని ద్వారా 25 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. గత వైసిపి దోపిడి పాలనతో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని, మద్యం ఇసుక లాంటి కుంభకోణాలతో రాష్ట్రాన్ని లూటీ చేయటం వలన పాలించే అర్హత లేదని ప్రజలు వైసీపీని తరిమికొట్టారన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసి సంక్షేమ పథకాల అమలు చేస్తూ ప్రజలను ఆదుకోవడం జరుగుతుందన్నారు.
వైసీపీ పాలనలో రైతులను నట్టేట ముంచారని, ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1600 కోట్లు ధాన్యం రైతులకు చెల్లించడం జరిగిందన్నారు.
రోడ్లు, డ్రైనేజీలు, పలు అభివృద్ధి పనులు చేపడుతూ గ్రామాల్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు.
మండలంలోని గోపువారిపాలెం గ్రామంలో 32 లక్షల వ్యయం నూతనంగా నిర్మించిన పంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే అదే గ్రామంలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. గుండె పల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన సిసి రోడ్డును ప్రారంభించారు. బొగ్గరం గ్రామంలో 1.40 కోట్లతో నిర్మించిన చిట్టాపురం – బొగ్గరం లింకు రోడ్డును ప్రారంభించారు. గోపువారి పాలెం గ్రామంలో సర్పంచ్ శ్రీనివాసరావు, యువత ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు.
