
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పార్టీ పోషిస్తున్న పాత్ర అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులు, వీరమహిళలు, పార్టీ నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు.
ఇదే సందర్భంలో మంత్రి నారా లోకేష్‌కూ డా పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ జనసేన పార్టీ ప్రజాజీవితంలో భాగమవుతూ ముందుకు సాగుతున్నదని ఆయన అన్నారు. పార్టీ ప్రకటించిన ఏడు సిద్ధాంతాలతో సమాజంలో మార్పు తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
పాడేరు ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ప్రాంతంలో పర్యటించారు. ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన వెళ్లి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు.
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓనూరులో జనసేన పార్టీ జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , అరకూ పార్లమెంటు ఇన్చార్జ్ గంగులయ్య, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్థానిక మహిళల స్వాగతం
పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా స్థానిక మహిళలు సంప్రదాయ థింసా నృత్యంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పవన్ సమక్షంలో పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు.
అంగన్వాడీ కేంద్రం సందర్శన
పాడేరు పర్యటనలో భాగంగా ఓనూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు. అక్కడ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
