
గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం
- ప్రధానమంత్రి జన్ మన్ (అడవితల్లి బాట) ద్వారా నిర్మించిన రోడ్ల పరిశీలన
- నిర్మాణం పూర్తయిన రహదారుల ప్రారంభోత్సవం
• పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామ ప్రజలతో శ్రీ పవన్ కళ్యాణ్ మాటా-మంతి
• గిరిపుత్రులతో కలసి మధ్యాహ్న భోజనం
జనసేన పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భిన్నమైన ఆలోచనతో ముందుకెళ్తుంటారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ తాను లేనిదే రాష్ట్రరాజకీయాలు లేవు అనే ఎలా అందరి దృష్టిని ఆకర్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించిన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు విభిన్నంగా జరిగాయి.
పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఈ సారి గిరి పుత్రుల మధ్య నిర్వహించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ స్థాయిలో జరిగే వేడుకల్లో స్వయంగా పాల్గొంటున్నారు. శనివారం పాడేరు నియోజకవర్గం, నందిగరువు అనే గిరిజన గ్రామంలో ఈ వేడుకలను నిర్వహించారు.
తొలుత పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను ఆవిష్కరించారు పవన్.
అనంతరం ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. పీఎం జన్ మన్ పథకం నిధులతో ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలి నడకన పరిశీలించి ప్రమాణాలు తనిఖీ చేస్తూ, మార్గమధ్యంలో గిరిజనులతో మమేకం అయ్యారు.
అనంతరం అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా నిర్మాణం పూర్తయిన రోడ్లను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
అనంతరం నందిగరువు గ్రామ ప్రజలతో మాట-మంతి కార్యక్రమంలో నిర్వహించారు పవన్. ఈ సందర్భంగా గిరిజన ప్రాంత గ్రామీణ ప్రజల మనోభావాలు, ప్రభుత్వ పథకాలు పేదల స్థితిగతులను స్వయంగా తెలుసుకున్నారు, గ్రామస్తుల సమస్యలు వారి కోరికలను అధికారులతో చర్చించి తక్షణమే వాటి పరిష్కారానికి ఆదేశించారు. మరి కొన్ని సమస్యల పరిష్కారానికి సిఎం తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. అనంతరం గిరిజనులతో కలసి మధ్యాహ్న భోజనం చేసారు. పవన్ కళ్యాణ్ రాకతో పాడేరు నియోజకవర్గంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో అధికార యంత్రాంగం గిరిజన గ్రామంలో అడుగుపెట్టడంతో గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, అందుకు పవన్ కళ్యాణ్ కారణమని సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ను అక్కున చేర్చుకున్న గిరిజన గ్రామస్తులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.