
చీఫ్‌విప్ జీవీకి “ఎ” గ్రేడ్
ఎమ్మెల్యేలకు ర్యాంకులు ప్రకటించిన సీఎం
ఊపిరిపీల్చుకున్న కేడర్…
పల్నాడు జిల్లా రాజకీయాల్లో వినుకొండ నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇటీవల స్వర్ణ ఆంధ్రస్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో జీవీ ఆంజనేయులు ప్రసంగంపై ఆ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాయి. జీవీ తన చేతగాని తనాన్ని తానే అంగీకరించాడంటూ ప్రతిపక్ష వైసీపీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. ఇంతకీ అంతలా ట్రోల్ అవటానికి కారణమేమిటంటే... ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడుతున్న జీవీ సీఎం చంద్రబాబు నాయుడును తమ కుటుంబ పెద్దగా భావించి, వినుకొండ అభివృద్ధికి సహకరించాలని కోరే క్రమంలో సర్.. వినుకొండలో జీవీ ఆంజనేయులు ఏమీ అభివృద్ధి చేయలేదు అని ప్రజలు చెప్పుకుంటున్నారు... మీరు సహకరిస్తే వినుకొండను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను అను సీఎంకి విన్నవించుకున్నారు. ఇక అంతే ఆ మాటలు వైసీపీ నాయకులకు అస్త్రాలుగా మారాయి. ఓ దశలో ఈ వ్యాఖ్యలపై జీవీ సొంతపార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పలేక నోటిమీద వేలేసుకున్నంత పనైంది. సౌమ్యుడు అయిన జీవీ కఠినంగా వ్యవహరించరని, ఆయన హయాంలో అభివృద్ధి జరుగుతున్నా అది ఆయన చెప్పుకోలేకపోతున్నారన్న వాదన ఉంది. ఇటీవల పల్నాడు జిల్లాకు చెందిన ఏడుగురు శాసనసభ్యులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సీల్డు కవర్లు అందజేయగా ఎ గ్రేడ్‌తో ముందువరుసలో నిలవటంతో జీవీ ఆంజనేయులు ఊరట లభించినట్లయింది. కాగా కూటమి అధికారంలోకి వచ్చాక జీవీ 21 నెలల పాలనలో అభివృద్ధి పనులు గ్రామ గ్రామాన జరుగుతున్నాయని, అయితే వాటిని చెప్పుకోవటంలో జీవీ, కేడర్ వెనుకబడుతోందని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సైతం తిప్పికొట్టలేకపోతున్నారని అభిమానులు, ప్రజల నుండి వినిపిస్తుంది.