పల్నాడు వైసీపీకి ‘కొత్త రెడ్డి’ గారు…?
జగన్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

పల్నాడు: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పౌరుషానికి, పట్టుదలకు మారుపేరు పల్నాడు గడ్డ. ఇక్కడ రాజకీయం ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షనే. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత స్తబ్దుగా ఉన్న నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ సెగ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ప్రయోగాల నుంచి పాఠాలు నేర్చుకున్న వైసీపీ, ఈసారి ‘లోకల్ సెంటిమెంట్ + సామాజిక సమీకరణాల’ కలయికతో కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.
అనిల్ కుమార్ యాదవ్ నిష్క్రమణ..నెల్లూరు బాట!
గత ఎన్నికల్లో నెల్లూరుకు చెందిన డైనమిక్ లీడర్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను జగన్ ఇక్కడికి పంపారు. జిల్లాకు కొత్త వ్యక్తి అయినప్పటికీ, జగన్ మాట కోసం అనిల్ శాయశక్తులా కృషి చేశారు. ప్రచారంలో జన స్పందన బాగున్నప్పటికీ, కూటమి వ్యూహాలు మరియు సామాజిక సమీకరణాల వల్ల ఆయన ఓటమి చవిచూశారు. అయితే, ఓటమి తర్వాత కూడా కేడర్‌కు అండగా ఉన్న అనిల్, ప్రస్తుతం తిరిగి తన సొంత జిల్లా నెల్లూరు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ స్థానానికి బలమైన ‘స్థానిక’ నాయకుడి వేట మొదలైంది.
తెరపైకి ప్రముఖ వైద్యుడు.. ఎవరా ‘కొత్త రెడ్డి’గారు ?
నరసరావుపేట పార్లమెంట్ అంటేనే రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గాల ఆధిపత్యం ఉన్న స్థానం. గతంలో ఇక్కడి నుండి మేకపాటి రాజమోహన్ రెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వంటి నేతలు ఘనవిజయం సాధించిన చరిత్ర ఉంది. ఈ చరిత్రను పునరావృతం చేసేలా, జగన్ ఈసారి పల్నాడు జిల్లాకే చెందిన ఒక ప్రముఖ వైద్యుడి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సదరు వైద్యుడి ప్రత్యేకతలు….
సేవా దృక్పథం: కులమతాలకు, పార్టీలకు అతీతంగా జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందారు.
ఆర్థిక బలం: ఎన్నికల ఖర్చును తట్టుకోగల ఆర్థిక పుష్టి ఉన్న నేతగా పేరుంది.
రాజకీయ సంబంధాలు: అటు వైసీపీతోనూ, ఇటు టీడీపీతోనూ సత్సంబంధాలు కలిగి ఉండటం విశేషం.
స్థానికత: జిల్లా వాసి కావడంతో కేడర్‌లో నమ్మకం పెరిగే అవకాశం ఉంది.
ఏడు నియోజకవర్గాల సమీకరణం
నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం మెండుగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఈ ఏడు సెగ్మెంట్లలో పార్టీని గాడిలో పెట్టాలంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరమని జగన్ భావిస్తున్నారు. ఆ ఏడు నియోజకవర్గాల నేతల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం, ఈ ‘డాక్టర్’ గారి వైపే మొగ్గు చూపుతున్నట్లు టాక్.
సదరు నేత నిర్ణయం ఏంటి?
జగన్ పంపిన రాయబారాన్ని సదరు వైద్యుడు స్వాగతిస్తారా? లేదా “ఇప్పుడే వద్దు.. ఎన్నికలకు ఏడాది ముందు చూద్దాం” అంటారా? లేక రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతారా? అనేది ఇప్పుడు పల్నాడులో హాట్ టాపిక్. ఒకవేళ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం, పల్నాడు వైసీపీలో కొత్త ఉత్సాహం రావడం ఖాయం.
వైసీపీకి అండగా నిలిచేందుకు ఈ ‘కొత్త రెడ్డి’ గారు ముందడుగు వేస్తారో… పల్నాడు వైసిపి కి సరైన చికిత్స చేసేందుకు డాక్టర్ గారు అంగీకరిస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే!