పల్నాడు జిల్లా ప్రజలకు శుభవార్త…
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సందర్శించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించిన వారు, పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే వేగాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ, మే 15వ తేదీ నాటికి మెడికల్ కాలేజీ నిర్మాణ పనులన్నీ పూర్తిచేయాలని, ఈ నెల 15వ తేదీ నాటికి ఓపీ బ్లాక్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే కాలేజీ మరియు బోధనాసుపత్రి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనులు వేగంగా పూర్తి దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే సిబ్బంది నియామక ప్రక్రియ కూడా పూర్తైందని, మే మొదటి తేదీ నుంచే ఓపీ సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, గతంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం తక్కువ సమయంలోనే పూర్తి దశకు తీసుకువచ్చిందని, పల్నాడు ప్రాంతానికి ఇది గొప్ప వరమని అన్నారు.
ఈ మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే పల్నాడు ప్రజలకు భారీ ఊరట లభించనుంది. ఇప్పటివరకు చిన్నపాటి చికిత్సలకే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా, ఇకపై స్థానికంగానే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర వైద్య సేవలు, స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు, తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స, వైద్య విద్య అవకాశాలు ఒకే చోట లభించనున్నాయి. ముఖ్యంగా పేద మరియు గ్రామీణ ప్రజలకు ఇది జీవనాధారంగా మారనుండగా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఇది కీలకంగా నిలవనుంది.