మీడియాకి రాజకీయ రంగు… సమాజానికి పెనుముప్పు!
ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలతో సమానంగా మీడియాను నాలుగో స్తంభంగా (Fourth Estate) అభివర్ణిస్తారు. గంగానది ప్రవాహంలా పవిత్రంగా, నిరంతరం ప్రజల పక్షాన ప్రవహించాల్సిన మీడియా, నేడు రాజకీయ రంగు పులుముకుని కలుషితం కావడం సమాజానికి పెనుముప్పుగా మారింది. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పత్రికలు ఒక ఆయుధంగా పనిచేసి, ప్రజలను చైతన్యపరిచి, బ్రిటీష్ పాలకుల గుండెల్లో నిద్రపోయాయి. నాటి మీడియా విలువలు, సిద్ధాంతాలు కేవలం ‘సత్యం’ మరియు ‘ప్రజాక్షేమం’ చుట్టూనే తిరిగేవి. కానీ, నేటి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. రాజకీయ పార్టీల నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మీడియా సంస్థలను కబళించడంతో, వార్త అనే మాటకు అర్థం మారిపోయింది. నిబద్ధతతో పనిచేయాల్సిన కలం.. రాజకీయ కండువా కప్పుకోకపోయినా, ఒక సిద్ధాంతానికి బానిసగా మారిపోవడం జర్నలిజం విలువలను పాతాళానికి తొక్కుతోంది.
అధికార పక్షానికి వంత పాడే మీడియా ఒకవైపు, ప్రతిపక్షానికి భజన బృందంగా మారిన టీవీ ఛానళ్లు మరోవైపు చేరి వాస్తవాలను సమాధి చేస్తున్నాయి. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాని వెనుక ఉన్న యదార్థాన్ని ప్రజలకు చేరవేయడం మీడియా ప్రాథమిక ధర్మం. కానీ, నేడు ఆ సంఘటనను తమకు అనుకూలమైన కోణంలో వక్రీకరించి ప్రచురించడం పరిపాటిగా మారింది. దీనివల్ల ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియక సామాన్య ప్రజలు అయోమయంలో పడిపోతున్నారు. రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో మీడియా ఆజ్యం పోస్తూ, సామాజిక బాధ్యతను మరిచిపోతోంది. మీడియా సంస్థలు కేవలం యాజమాన్యాల రాజకీయ అజెండాలను అమలు చేసే సాధనాలుగా మారితే, సామాన్యుడి గొంతుక ఎవరికి వినిపిస్తుంది? పాలకుల తప్పిదాలను ప్రశ్నించాల్సిన మీడియా, వారి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరం.
సమాజం ఎదుర్కోబోయే సవాళ్లు దీనివల్ల మరింత జటిలం కానున్నాయి. మీడియా తన స్వతంత్రతను కోల్పోతే, అది కేవలం ఒక వర్గం ప్రచార సాధనంగా మిగిలిపోతుంది. రాజకీయ నాయకులు తమ అనుబంధ సంస్థల ద్వారా మీడియాను రొచ్చులోకి దించి, జర్నలిజంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాలరాస్తున్నారు. మీడియా చట్టాలు మరియు జాతీయ స్థాయి సంస్థలు ఈ ధోరణిని అరికట్టడంలో విఫలమవుతున్నాయి. రాజకీయ నాయకులు ఆత్మవిమర్శ చేసుకుని మీడియాకు స్వేచ్ఛను ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. వార్తల్లో వాస్తవాలను మాత్రమే వడపోసి అందించినప్పుడే మీడియాకు తిరిగి పూర్వవైభవం దక్కుతుంది. ఈ రాజకీయ కబంధ హస్తాల నుండి మీడియా బయటపడకపోతే, రేపటి తరం సమాచార వికలాంగులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. మీడియా తన గంగ పాత్రను గుర్తు తెచ్చుకుని, స్వచ్ఛమైన మరియు నిష్పాక్షికమైన వార్తలతో సమాజ హితం కోసం పనిచేయడమే నేటి తక్షణావశ్యకం.
ఈ రాజకీయ విభజన వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే నిబద్ధత గల జర్నలిస్టులు నిత్యం అవమానాలను, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏదైనా ప్రజా సమస్యపై సమాచారం సేకరించడానికి వెళ్ళినప్పుడు, సామాన్య ప్రజల నుండి “మీది ఏ పార్టీ మీడియా? మీరు నిజం రాస్తారా లేక మీ యజమానులకు నచ్చింది రాస్తారా?” అనే సూటిపోటి మాటలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు గౌరవంగా చూసే ప్రజలే నేడు జర్నలిస్టులను చూసి “వచ్చేశారయ్యా.. పలానా పార్టీ భజన బృందం” అంటూ ఎగతాళిగా మాట్లాడుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. వార్తా సేకరణలో భాగంగా ఎవరినైనా ప్రశ్నిస్తే, “నువ్వు మా పార్టీకి వ్యతిరేకమా?” అని నిలదీసే స్థాయికి రాజకీయ రంగు ముదిరిపోయింది. మీడియా సంస్థల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో, నిజాయితీగా వార్తను అందించాలనుకునే జర్నలిస్టులు అటు రాజకీయ నాయకుల ఒత్తిడికి, ఇటు ప్రజల అపనమ్మకానికి మధ్య నలిగిపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో జర్నలిజం అంటే కేవలం రాజకీయ ప్రచార హోరుగానే మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.
ఈ దుస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కేవలం వ్యవస్థలదే కాదు, ప్రతి మీడియా సంస్థది కూడా. జర్నలిస్టులు, మీడియా యాజమాన్యాలు ఇప్పటికైనా రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి భజన చేయటం మానుకోవాలి. నిష్పాక్షికతను, నైతిక విలువలను ప్రాణవాయువుగా మార్చుకుని, మీడియాకు ఉజ్వల భవిష్యత్తును కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది, ప్రజల్లో మీడియా పట్ల విశ్వసనీయత తిరిగి పుంజుకుంటుంది.
ఎడిటర్.