రేవంత్ ‘సిద్దిపేట’ సవాల్ సాధ్యమేనా?
హరీష్ రావు కోటలో కాంగ్రెస్ జెండా ఎగిరేనా!

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి సిద్దిపేటపైనే నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ వేదికగా విసిరిన సవాల్ పెను దుమారం రేపుతోంది. దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్న సిద్దిపేటలో ఈసారి మార్పు రావాలని, వచ్చే ఎన్నికల్లో అక్కడ హరీష్ రావును ఓడించిన అభ్యర్థికి నేరుగా మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ సంచలన ప్రకటన వెనుక కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాకుండా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహం కూడా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడి ఏప్రిల్ 5న బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవ్వడం, కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కడంతో.. వాటన్నింటినీ కవర్ చేసేందుకే రేవంత్ ఈ ‘సిద్దిపేట’ అస్త్రాన్ని ప్రయోగించారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి సవాల్‌పై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అదే స్థాయిలో ధీటుగా స్పందించారు. రేవంత్ రెడ్డికి అసలు సిద్దిపేట గడ్డపై కాలు పెట్టే నైతిక హక్కే లేదని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట అభివృద్ధి కోసం మంజూరైన రూ. 1,070 కోట్ల నిధులను రేవంత్ ప్రభుత్వం రద్దు చేసిందని, వెటర్నరీ కాలేజీ వంటి కీలక సంస్థలను తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు తరలించుకుపోయారని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. “కష్టపడి ప్రాజెక్టులు కట్టింది మేము.. కేవలం రిబ్బన్లు కట్ చేసి శిలాఫలకాలపై పేర్లు వేయించుకుంటున్నది మీరు” అంటూ ఘాటుగా విమర్శించారు. నియోజకవర్గంలో 52 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, అభివృద్ధిని అడ్డుకున్న రేవంత్ రెడ్డికి సిద్దిపేట ప్రజలే బుద్ధి చెబుతారని హరీష్ రావు ఎదురుదాడికి దిగారు.
అయితే, రేవంత్ రెడ్డి సవాల్ నెరవేరడం ఎంతవరకు సాధ్యమనేది ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు 1,05,514 ఓట్లతో, ఏకంగా 82,308 ఓట్ల భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 13 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ ఓట్లు కలిపినా హరీష్ రావు మెజారిటీలో సగం కూడా ఉండకపోవడం గమనార్హం. దశాబ్దాలుగా నియోజకవర్గంతో హరీష్ రావుకు ఉన్న గ్రౌండ్ లెవల్ కనెక్షన్, కేడర్ బలం ముందు కాంగ్రెస్ నిలబడటం కత్తిమీద సామే.
రేవంత్ రెడ్డి ప్రకటించిన ‘మంత్రి పదవి’ ఆఫర్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నమే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో హరీష్ రావుకున్న పట్టును బద్ధలు కొట్టడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ సవాల్ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.