
ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ కరోనా సమయంలో ప్రజలకు విస్తృతమైన సేవలు అందించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు ఈ విధానాన్ని తాను అధికారంలోకి వస్తే అమలు చేస్తానని తమిళ వ్యక్తి కలగం టీ వీ కే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ దళపతి సంచలన హామీ ఇచ్చారు.
తమిళనాడులో ‘వాలంటరీ మోడల్’..
దళపతి విజయ్ బిగ్ హామీ..
ఆంధ్రప్రదేశ్‌లో అమలైన వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. టీవీకే (టీవీకే ) పార్టీ అధినేత విజయ్ ఎన్నికల ముంగిట కీలక హామీ ప్రకటించారు. ఏపీలో అమలైన విధంగా వాలంటరీ వ్యవస్థను తమిళనాడులో కూడా ప్రవేశపెడతానని ఆయన స్పష్టం చేశారు.
ఏపీలో వై . ఎస్ . జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సేవలను నేరుగా ఇంటి వద్దకే అందించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు ప్రజల ప్రశంసలు అందుకున్నాయి.
ఇదే మోడల్‌ను తమిళనాడులో అమలు చేస్తానని ప్రకటించిన విజయ్, ప్రభుత్వ సేవలను ప్రజల దరిదాపుల్లోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే విధంగా పాలనను మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇక మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల అంశం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే కొనసాగుతోంది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు రూ.10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానం అమలు కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వాలంటీర్లలో అసంతృప్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో విజయ్ చేసిన ఈ ప్రకటన దక్షిణ భారత రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఏపీలో ప్రారంభమైన వాలంటరీ మోడల్ ఇప్పుడు తమిళనాడుకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కొనసాగితే, ఇతర రాష్ట్రాలు కూడా ఈ మోడల్‌ను అనుసరించే పరిస్థితి రావచ్చు.
ఏపీలో వాలెంటరీ వ్యవస్థ సేవలు ఇలా…
మొత్తం వాలంటీర్లు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 2.5 లక్షల నుండి 2.6 లక్షల మంది గ్రామ మరియు వార్డు వాలంటీర్లను నియమించింది.
నిర్వహణ: ప్రతి వాలంటీర్‌కు సుమారు 50 నుండి 75 ఇళ్ల బాధ్యతను అప్పగించారు.
వేతనాలు: వాలంటీర్లకు ప్రారంభంలో నెలకు ₹5,000 గౌరవ వేతనం (Honorarium) చెల్లించేవారు.
పనితీరు ఇలా…
సేవల డెలివరీ: ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకే చేర్చడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. పెన్షన్ల పంపిణీ, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ వంటి దాదాపు 556 రకాల సేవలను వీరు అందించారు.
సాఫల్యత: గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలను చేరవేయడం వల్ల పారదర్శకత పెరిగిందని, మధ్యవర్తుల ప్రమేయం తగ్గిందని కొన్ని సర్వేలు పేర్కొన్నాయి.
నిర్వీర్యం కావడానికి కారణాలు..
వాలంటీర్ వ్యవస్థ 2024 నాటికి పలు కారణాల వల్ల బలహీనపడింది లేదా నిలిపివేయబడింది:
రాజకీయ ఆరోపణలు: వాలంటీర్లను అప్పటి అధికార పార్టీ (వైస్సార్సీపీ) తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఎన్నికల సమయంలో రాజీనామాలు…
2024 ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేయడంతో, వేల సంఖ్యలో వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయిన కూటమి ప్రభుత్వం…
ప్రభుత్వ విధానం: కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం, ఈ వ్యవస్థ కంటే గ్రామ/వార్డు సచివాలయాలు మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సేవలు అందించడం మేలని భావించింది. పెన్షన్ల పంపిణీని సచివాలయ సిబ్బందికి అప్పగించడం వల్ల వాలంటీర్ల అవసరం తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది.
చట్టపరమైన గుర్తింపు లేకపోవడం…
గత ప్రభుత్వం ఈ వ్యవస్థను శాశ్వతం చేస్తూ లేదా కాలపరిమితిని పొడిగిస్తూ కొత్త ఉత్తర్వులు (GOs) జారీ చేయకపోవడం కూడా ఒక కారణంగా చెప్పబడింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థ అధికారికంగా అమలులో లేదు. సేవలు నేరుగా సచివాలయాల ద్వారా అందుతున్నాయి.
తాజాగా తమిళనాడు లో టీవీకే విజయ్ వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రకటించటం తో మరో మారు ఏపీ రాజకీయాల్లోను చర్చనీయాంశంగా మారింది.