
16 వ వసంతంలోకి వైసిపి…
2011 మార్చి 12 పార్టీని ప్రకటించిన జగన్
2019 ఎన్నికల్లో ఘన విజయం
2024 ఎన్నికల్లో ఘోర పరాభవం
బలం…బలగం అన్ని జగనే…
ఓడిపోయిన వెన్నుచూపని నాయకుడిగా…
మలుపు తిప్పిన ప్రజాప్రస్థానం పాదయాత్ర…
ప్రజలకు చేరువైన... జగన్..
ఆటు పోట్లు ఎదుర్కొంటూ…
అభిమానులకు అండగా ఉంటూ…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న జగన్

వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి… తండ్రి ఆశయ సాధన కోసం వైసీపీ పార్టీని పెట్టి… గెలిచినా ఓడినా తాను నమ్ముకున్న కార్యకర్తల కోసం అండగా ఉంటానని మాటల్లో చేతల్లో చూపుతూ… నాయకుడంటే జగన్… అని చెప్పుకునేలా… మా నమ్మకం నువ్వే జగన్ అని కార్యకర్తలు వెంట నడిచేలా రాజకీయ రంగంలో భిన్న మైన నాయకుడిగా, దేశ రాజకీయాల్లో నమ్మకం అని మాటకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడిగా… రాష్ట్ర దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జగన్ స్థాపించిన వైసీపీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెట్టింది…. పార్టీ స్థాపించిన నాటి క్లిష్ట పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటున్న తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తామన్న భరోసాతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు జగన్.

రాష్ట్ర దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు వైయస్ జగన్. తండ్రి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉంటూ, రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యాక హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పొందారు. తండ్రి మరణంతో రాజకీయ రంగంలో అడుగుపెట్టిన వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు ప్రయత్నించారు. తన తండ్రి మరణంతో చనిపోయిన వందలాదిమంది కార్యకర్తల కుటుంబాలను ఓదార్పు యాత్రతో పరామర్శించేందుకు వెళ్తానని చెప్తే… అందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో వైయస్ జగన్ తన తండ్రి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీని వీడి… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని 2011 మార్చి 12వ తేదీన స్థాపించారు.
ఓదార్పు యాత్రతో ప్రజలకు చేరువై అభిమానుల్లో తనదైన ముద్ర వేసుకున్న జగన్… క్రమంగా వైసీపీని బలోపేతం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి, చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ప్రజల దృష్టి జగన్ వైపు మళ్ళింది. 2014 ఎన్నికల్లో తొలిసారి వైసీపీని సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపి 64 సీట్లతో గెలుపొందారు. కూటమి గా వచ్చిన బిజెపి జనసేన టిడిపి ప్రలోభాలను ఎదుర్కొని కార్యకర్తలను పార్టీని కాపాడుకున్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తాను… కార్యకర్తలకు అండగా ఉంటాను.. అంటూ ఎన్నికల ఫలితాల రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు… నిజం చేస్తూ 2014 నుండి 19 వరకు ప్రజల పక్షాన నిలబడి నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు అంటే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈ కాలంలో ప్రజలకు మరింత చేరువయ్యారు. 2019 ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది నవరత్నాలు హామీలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. సర్వేలన్నీ అంచనా వేసినట్లు గానే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ ఘన విజయం సాధించి తొలిసారి జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు.
తొలిసారి ముఖ్యమంత్రి అయినా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశ రాజకీయాల్లోనే సరికొత్త వరవడిని సృష్టించారు. నవరత్నాలలోని కొన్ని పథకాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్….
కులం చూడం మతం చూడం… అంటూ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చారు. వాలంటీర్ల వ్యవస్థను స్థాపించి, సచివాలయాల ద్వారా పాలన వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం స్థాపించే దిశగా అడుగులు వేశారు.
అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలు, నాయకులు ఒక్క రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే చేర్చారు. కష్టించిన నాయకులు, కార్యకర్తల కంటే ప్రజలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు జగన్. కాలం గిర్రున తిరిగింది.. 2024 వచ్చింది… రాష్ట్ర రాజకీయాల్లో 2014 నాటి సీన్ మళ్లీ రిపీట్ అయింది.. జగన్మోహన్ రెడ్డి నీ ఢీకొట్టాలంటే విడివిడిగా పోటీ చేస్తే జగన్ ని ముఖ్యమంత్రి కాకుండా ఆపడం కష్టమని భావించిన ప్రత్యర్థి పార్టీలు కూటమిగా జతకట్టాయి. బిజెపి -జనసేన- తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాలకు గాను ఏకంగా 164 స్థానాలు కూటమి కైవసం చేసుకుంది. కూటమి పార్టీలకు వచ్చిన మొత్తం ఓటింగ్ శాతం వైసీపీకి పోలైన ఓట్లతో పోలిస్తే కేవలం నాలుగు నుండి ఐదు శాతం మాత్రమే వ్యత్యాసం ఉంది.
ఘోర ఓటమి చవిచూసిన… సంక్షేమ పథకాలు ఓట్లు గా మారకపోయినా నమ్ముకున్న పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం తాను నిలబడతానని జగన్ మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకుంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నాడు జగన్.
అధికారం కోల్పోయి రెండేళ్లు అయినా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా జగన్ జగన్ ఇదే మాట వినిపిస్తోంది ఇదే మాట కనిపిస్తుంది అంటే రాష్ట్ర రాజకీయాల్లో జగన్ ప్రభావం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చు.
పొత్తులు పెట్టుకోను అన్నమాటకి నేటికీ కట్టుబడి ఉండడం రాజకీయాల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. జగన్ అంటే ఒక నమ్మకం… జగన్ అంటే ఒక భరోసా… జగన్ అంటే ఒక ఆప్యాయత… జగన్ అంటే ఒక చరిత్ర… అన్నిటికీ మించి జగన్ అంటే… వీరాభిమానం.
2029 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఏ పార్టీ చేయని విధంగా సభ్యత్వ నమోదును నడిపించి, గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వం తో లక్షలాదిమంది సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. వై నాట్ 175 అని జగన్ ఇచ్చిన నినాదం నిజం కాకపోవచ్చు కానీ… వై నాట్ అగైన్ సీఎం జగన్… అన్నది మాత్రం నిజం చేయాలని కార్యకర్తలు వైసిపి కేడర్ భావిస్తుంది. కేసులు పెట్టిన, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఎక్కడా వెనక్కు తగ్గటం. జగన్ ధైర్యం ఏంటో అర్థం కాక కూటమి నాయకులకు బెరుకు మొదలైందని వైసిపి నాయకులు నమ్ముతున్నారు. మళ్లీ జగన్ సీఎం చేసుకోవాలన్న సంకల్పంతో వైసీపీ శ్రేణులు యాక్టివ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 16వ వసంతంలోకి వైసీపీ అడుగు పెట్టడం… ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది…
రానున్న రోజుల్లో వైసిపి రాజకీయ వ్యూహాలు… జగన్మోహన్ రెడ్డి అడుగులు… వైసీపీ కార్యకర్తల ఆకాంక్షలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
ఎడిటర్