జగన్ మాట తప్పడు…మడమ తిప్పడు..
-అమరావతికి వ్యతిరేఖం కాదు
-మూడు రాజధానులే మా అజెండా
-అవినీతిని మేము సహించేది లేదు
-చట్టాలు సవరించుకొనే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది
-విలేఖరుల సమావేశంలో మాజీ సీఎం జగన్

ఒక్క సారి కమిటైతే నా మాట నేనే వినను అని సినిమాలో డైలాగు. ఈరోజు జగన్ ప్రెస్‌మీట్ చూసినవారికి ఈ మాట గుర్తుకురాక మానదు. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా ఎక్కడా మాట తడబడకుండా గతంలో ముఖ్యమంత్రిగా తాను అధికారంలో ఉండగా అమరావతి విషయంలో ఎంత క్లారిటీగా మాట్లాడారో, ఇప్పుడు కూడా అదే రీతిలో వైఎస్ జగన్ అమరావతిపై తన వైఖరి స్పష్టం చేశారు. దీంతో జగన్ మాట తప్పడు..మడమ తిప్పడు అని అభిమానులు ఎందుకు అనుకుంటారో అర్ధం చేసుకోవచ్చు.
“అమరావతి”కి వ్యతిరేఖం కాదంటూనే…
రాష్ట్రంలో ప్రస్తుతం రాజధాని అంశం ప్రస్తుతం అత్యంత కీలక చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక మరియు శాశ్వత రాజధానిగా ఖరారు చేస్తూ ఇటీవల అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడమే కాకుండా, 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించి అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరింది.అమరావతిని కేవలం ఒక నగరంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక ఇంజిన్‌గా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీలో అమరావతి బిల్లు సందర్భంగా అమరావతిపై చర్చ కంటే జగన్ మోహన్‌రెడ్డి పైనే అందరూ చర్చించినట్లు అసెంబ్లీ సాక్షిగా స్పష్టమైంది. కాగా ఈ రోజు పార్లమెంట్లో ఏపీ రాజధాని బిల్లు ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో వైసీపీ కూడా అమరావతిపై అటు పార్లమెంట్‌లోనూ, ఇటు ఏపీ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో జగన్ మీడియా సమావేశంలో తన వైఖరి స్పష్టం చేశారు.
మూడు రాజధానులే మా విధానం : జగన్
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వికేంద్రీకరణ (మూడు రాజధానుల) విధానానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదని చెబుతూనే, అది ఏకైక రాజధానిగా ఉండటం వల్ల మిగిలిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందన్నది ఆయన ప్రధాన వాదన. కూటమి ప్రభుత్వం చేస్తున్న తీర్మానాలను ఆయన “రియల్ ఎస్టేట్ వ్యాపారం”గా అభివర్ణించారు. అమరావతిపై చంద్రబాబుకు ఉన్నది కేవలం స్వార్థపూరిత రాజకీయ ఆసక్తి తప్ప రాష్ట్ర ప్రయోజనం కాదని జగన్ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో, ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. కేంద్రం గనుక విభజన చట్టానికి సవరణ చేసి అమరావతిని శాశ్వత రాజధానిగా నోటిఫై చేస్తే, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడం సాంకేతికంగా కష్టమవుతుంది. అయితే, జగన్ తన మూడు రాజధానుల నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ అంశాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి, అమరావతి ఇప్పుడు కేవలం పాలనా కేంద్రం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ప్రధానాంశంగా మారింది.
అమరావతి అతిపెద్ద స్కామ్..
అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ‘దోపిడీ’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 2 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అమరావతి కోసం తగలేయడం ఆచరణాత్మకం కాదని, అది కేవలం ఒక వర్గానికి మేలు చేసేందుకే చంద్రబాబు వేసిన ప్లాన్ అని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే తాము విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఎంచుకున్నామని, కేవలం రూ. 10,000 కోట్లతో విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దవచ్చని ఆయన వివరించారు. చంద్రబాబుకు అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తమ ప్రభుత్వం ప్రతిపాదించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్లాన్‌ను అమలు చేయాలని సవాల్ విసిరారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న 110 కి.మీ హైవేను క్యాపిటల్ కారిడార్‌గా మారిస్తే రూ. 1.90 లక్షల కోట్లు ఆదా అవుతాయని జగన్ పేర్కొన్నారు. అమరావతి రియల్ ఎస్టేట్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే అసెంబ్లీలో తీర్మానాలు చేస్తున్నారని, అప్పుల భారం లేని అభివృద్ధి కోసం తాము చేసిన ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అమరావతిని కేవలం శాసన రాజధానిగా కొనసాగిస్తూ, మిగిలిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలన్నదే తమ విధానమని ఆయన పునరుద్ఘాటించారు.
జగన్ మోహన్‌రెడ్డి విలేఖరుల సమావేశం చూసిన తరువాత అమరావతి విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మరింత పెరిగే అవకాశం ఉంది. అప్పుడు రాజధాని అంశంపై ప్రధాన పక్షాల మధ్య మొదలైన యుద్ధం ఎన్నికల నాటికి తీవ్ర రూపం దాల్చే అవకాశం లేకపోలేదు. పైగా జగన్ మూడు రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళితే గెలవటం ఖాయమన్న అభిప్రాయంలో ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో తాను చెప్పినట్టుగానే మూడు రాజధానులకే కట్టుబడి ఉండటం అటు వైసీపీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చినా, జగన్ మోహన్‌రెడ్డి తన వైఖరిని అంత స్పష్టంగా చెపిన తదుపరి అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్న కంపెనీలు సైతం పునరాలోచన చేసే అవకాశం లేకపోలేదన్నది రాజకీయ పండితుల వాదన. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.