
‘వీరసింహారెడ్డి’ సినిమాటిక్ డ్రామాని తలపిస్తున్న… వైఎస్ కుటుంబ ఆస్తి వివాద కథనం ఇది….సోషల్ మీడియాలో పెండింగ్ లో ఉన్న ఈ టాపిక్ పాఠకుల కోసం..
వీరసింహారెడ్డి సీన్ రిపీట్….?
సినిమాలో బాలకృష్ణ తన చెల్లెలు ‘అన్నా’ అని పిలుస్తుందని ఆశగా ఎదురుచూస్తుంటే.. ఆమె ఏకంగా కత్తితో పొడుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, సోషల్ మీడియాలోనూ సరిగ్గా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. ఒకప్పుడు
నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల…. ఇప్పుడు అదే బాణాన్ని అన్న వైపు గురిపెట్టడం వైసీపీ శ్రేణులను కలచివేస్తోంది. వైసీపీ అభిమానుల వెర్షన్ ప్రకారం.. జగన్ తన చెల్లెలి కోసం ఎంతో ఓర్చుకున్నారు. కానీ షర్మిల మాత్రం కత్తి పట్టకపోయినా, తన ‘మాటల తూటాలతో’ అన్న మనసును గాయపరుస్తున్నారని వారు వాపోతున్నారు. వరుస ప్రెస్ మీట్లు, విజయమ్మ లేఖలు, “అన్నా అనే పదానికి కలంకం” అనే విమర్శలు. ఇది చూస్తుంటే, “అభిమానం
ఉన్న చోటే కదా ఆవేదన ఉంటుంది” అన్నట్లుగా జగన్ అభిమానులు ఫీల్ అవుతున్నారు.
ఆస్తి పంపకం కట్టుబాటా? చట్టమా?…
సాధారణంగా మన సమాజంలో ఆడపిల్లకు పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇచ్చి పంపిస్తారు. కానీ ఇక్కడ విజయమ్మ మరియు షర్మిల పెడుతున్న డిమాండ్ సరికొత్త చర్చకు దారితీసింది. జగన్ సంతానం ఇద్దరు, షర్మిల సంతానం ఇద్దరు.. ఈ నలుగురు మనవలు, మనవరాళ్లకు ఆస్తి సమానంగా పంచాలి అని విజయమ్మ చెప్తోంది.
“ఇది సమాజ కట్టుబాట్లను ధిక్కరించడమే కదా!” అని వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి. “రేపు పొద్దున షర్మిల గారు రాష్ట్రంలోని మహిళలందరికీ పుట్టింటి ఆస్తిలో సమాన వాటా ఇప్పిస్తానని మేనిఫెస్టోలో పెడతారా?” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.
ఇంటి శత్రువులే కొంప ముంచారా?
2024 ఎన్నికల ఓటమికి బయట ఉన్న ప్రత్యర్థుల కంటే, ఇంట్లో ఉన్న విభేదాలే ఎక్కువ నష్టం చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తల్లి, చెల్లి ఇద్దరూ జగన్‌కు వ్యతిరేకంగా మారడం అనేది కేవలం ఆస్తి తగాదా మాత్రమే కాదు, అది ఒక 'హ్యూమన్ యాంగిల్' లో చూస్తే ఒక అన్న పడుతున్న మానసిక క్షోభగా వైసీపీ వర్గాలు చిత్రీకరిస్తున్నాయి.
సినిమాలో అయితే చెల్లెలు చివర్లో పశ్చాత్తాపపడుతుంది. కానీ రియల్ లైఫ్ పాలిటిక్స్‌లో, ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో ఈ ఆస్తి తగాదాలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకవైపు చట్టబద్ధమైన హక్కులు, మరోవైపు కుటుంబ గౌరవం.. ఈ రెండింటి మధ్య ‘జగనన్న’ నలిగిపోతున్నారన్నది అభిమానుల ఆవేదన. “ఆస్తి తగాదాలు ఇంట్లో ఉంటే రచ్చ.. బజారుకు వస్తే రాజకీయం!” అని నెటిజన్లు పెడుతున్న కామెంట్లే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి.