
జైలుపై వైసీపీ నేతల మోజు..
పదవుల కోసం సరికొత్త ‘క్వాలిఫికేషన్’?
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు “జైలు” చుట్టూ ఒక వింతైన చర్చ నడుస్తోంది. ఒకప్పుడు జైలుకు వెళ్లడమంటే రాజకీయంగా అవమానంగా భావించేవారు. కానీ, ఇప్పుడు వైసీపీ నేతల మాటలు, ప్రవర్తన చూస్తుంటే అది ఒక “పొలిటికల్ గ్లామర్” లా, భవిష్యత్తులో పదవుల కోసం సంపాదించుకోవాల్సిన ఒక అర్హతలా మారిపోయిందా అనే అనుమానం కలగక మానదు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలవుతూ “జైలుకు మళ్ళీ వస్తా” అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. జైలు అంటే ఇష్టమా లేక అక్కడ వచ్చే పబ్లిసిటీ అంటే మోజా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం అంబటి మాత్రమే కాదు, జగన్ మోహన్ రెడ్డి సైతం “కేసులు పెడితే పెట్టించుకోండి.. జైలుకు వెళ్లడానికీ సిద్ధపడండి” అని కార్యకర్తలకు పిలుపునివ్వడం చూస్తుంటే, జైలు వాసాన్ని ఒక ‘త్యాగం’గా చిత్రీకరించే ప్రయత్నం కనిపిస్తోంది.
అక్రమ కేసులు…పెంచుతున్న ‘క్రేజ్’…
వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వం కావాలనే తమపై అక్రమ కేసులు బనాయిస్తోందని, ఈ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి జైలుకు వెళ్లే వారినే వైసీపీ అధిష్టానం ప్రత్యేకంగా గుర్తిస్తుందని నేతలు భావిస్తున్నారు. ఈ ‘కష్టాల కాలం’లో ఎవరు జైలు గడప తొక్కుతారో, వారికే భవిష్యత్తులో పార్టీలో అత్యున్నత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుందని నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే జైలుకు వెళ్లడాన్ని భయంగా కాకుండా, ఒక పొలిటికల్ మైలేజ్ ఇచ్చే అంశంగా చూస్తున్నారు.
ఈవీఎం ధ్వంసం కేసులో 99 రోజుల పాటు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడుదలయ్యాక ఆయనకు పార్టీ శ్రేణులు పలికిన ఘన స్వాగతం, ఇతర నేతల పరామర్శలు చూస్తుంటే పార్టీలో ఆయన క్రేజ్ అమాంతం పెరిగినట్లు అర్థమవుతోంది. వీరితో పాటు:
* కాకాని గోవర్ధన్ రెడ్డి: నెల్లూరు కోర్టు ఫైళ్ల దొంగతనం కేసులో ఆరోపణలు.
* పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి: పుంగనూరు ఘటనలు, ఇతర వివాదాల్లో చిక్కుకోవడం.
* జోగి రమేష్, వల్లభనేని వంశీ: అరెస్టులు, విచారణలు
లోకేష్ ‘రెడ్ బుక్’ – వైసీపీ కౌంటర్…
మరోవైపు, నారా లోకేష్ తన “రెడ్ బుక్” తో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం దీనికి రివర్స్ అటాక్ ఇస్తున్నారు. “రెడ్ బుక్ లో మా పేర్లు ఉండటం మాకు గర్వకారణం.. అందులో ఉన్న వారికే రేపు అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులు ఖాయం” అనే రేంజ్లో వారు చేసే కామెంట్స్ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొని జైలుకు వెళ్లడమే తమకు తిరుగులేని ఇమేజ్ ఇస్తుందని వారు భావిస్తున్నారు.