గాయపడిన పోలీసులకు హోం మంత్రి అనిత పరామర్శ..
మంగళగిరి : కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన పోలీసులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె కలిసి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
గాయపడిన పోలీసులకు ధైర్యం చెప్పిన మంత్రి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, అనుమతులు లేకుండా క్రాకర్స్ విక్రయిస్తున్న దుకాణాల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని వివరించారు. ఈ ఘటనలో ఒక ఎస్సై, ఒక కోర్ట్ కానిస్టేబుల్ మరియు ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడినట్లు తెలిపారు.
అబ్దుల్లా అనే కానిస్టేబుల్కు 50-60 శాతం గాయాలున్నాయని, మిగతా వారికి ప్రాణాపాయం లేదని ఆమె పేర్కొన్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
గాయపడిన పోలీసులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి, వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే, మెరుగైన వైద్యం అందిస్తున్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.