వినుకొండలో 144 సెక్షన్ విధించడంపై వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆగ్రహం
వినుకొండ: పట్టణంలో 144 సెక్షన్ విధించాల్సిన అవసరం ఏమొచ్చిందో పోలీసులు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని వినుకొండ మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం వద్ద మార్కులు కొట్టేయాలనే అత్యుత్సాహంతో పోలీసులు రాత్రింబవళ్లు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల చుట్టూ తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
గ్రామాల నుంచి వినుకొండకు వస్తే బైక్లు సీజ్ చేస్తామని, కేసులు పెడతామని బెదిరించడం ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని ధ్వజమెత్తారు.
డీఎస్సీ అవకతవకలపై ప్రజల గొంతును అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్సార్సీపీ చేపట్టే నిరసన ర్యాలీ ఆగదని ఆయన స్పష్టం చేశారు.
“ప్రజల కోసం ప్రశ్నిస్తాం.. ప్రజల హక్కుల కోసం పోరాడుతాం.. ఈ నిరసనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు” అని ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి హెచ్చరికలు జారీ చేశారు.