🔥 జగన్ కొత్త స్ట్రాటజీ… కూటమికి ‘మావిగన్’ గండం తప్పదా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి ఎన్నికకు ఒక స్పష్టమైన అజెండా ఉంటుంది. ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఆ అజెండానే గెలుపు-ఓటములను నిర్ణయిస్తుంది. 2014లో రాష్ట్ర విభజనపై ఆవేదనను క్యాష్ చేసుకున్న టీడీపీ, “పునర్నిర్మాణం” అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది. అప్పట్లో అనుభవం లేని నాయకత్వం కంటే స్థిరత్వం కోసం ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపారు.
2019 నాటికి పరిస్థితి పూర్తిగా మారింది. “ప్రత్యేక హోదా” అజెండాగా మారి, ఆ అంశంపై నిరంతర పోరాటం చేసిన వైసీపీకి భారీ మద్దతు లభించింది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే వాగ్దానాలు ప్రజల్లో నమ్మకం పెంచాయి. ఫలితంగా వైసీపీ అఖండ విజయాన్ని సాధించింది.
కానీ 2024 ఎన్నికల నాటికి “రాజధాని” అంశం రాష్ట్రవ్యాప్తంగా సెంటిమెంట్‌గా మారింది. మూడు రాజధానుల ప్రతిపాదనలో స్పష్టత లేకపోవడం, అమరావతిపై అనిశ్చితి నెలకొనడం—ఇవి ప్రజల్లో అనుమానాలను రేకెత్తించాయి. చివరకు “ఒకే రాజధాని” అవసరం అనే భావన బలపడడంతో వైసీపీ తీవ్రంగా నష్టపోయి కేవలం కొద్ది సీట్లకే పరిమితమైంది.
ఇప్పుడు 2029 ఎన్నికల దిశగా రాజకీయ అజెండా మళ్లీ మారుతోంది. కూటమి ప్రభుత్వం అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులను తమ ప్రధాన అస్త్రాలుగా మార్చుకుంది. పార్లమెంట్ స్థాయిలో చట్టబద్ధత కల్పిస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా స్థిరపరచే ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఈ అభివృద్ధి అజెండాతో ప్రజల్లో మళ్లీ నమ్మకం సంపాదించాలనే లక్ష్యంతో కూటమి ముందుకు సాగుతోంది.
ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన వ్యూహాలను కొత్తగా మలుస్తున్నారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక దీర్ఘకాలిక ఆలోచన, స్పష్టమైన లక్ష్యం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గని స్వభావం ఆయన రాజకీయ శైలిలో ప్రధాన లక్షణంగా భావించబడుతుంది.
ఇప్పుడాయన ముందుకు తెచ్చిన “మావిగన్” కాన్సెప్ట్ రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ అభివృద్ధి కారిడార్‌గా తీర్చిదిద్దే ఈ ఆలోచన—ఒకవైపు ప్రాంతీయ అభివృద్ధి, మరోవైపు ఓటు బ్యాంక్ సమీకరణ అనే రెండు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ప్రతిపాదనను కూటమి నేతలు తేలికగా తీసుకుంటే, అదే పెద్ద తప్పుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు తమ ప్రాంతానికి వచ్చే లాభనష్టాలను జాగ్రత్తగా అంచనా వేస్తారు. అభివృద్ధి అవకాశాలు కనిపిస్తే, రాజకీయంగా ఆ దిశగా మద్దతు ఇవ్వడం సహజం. ఈ క్రమంలో “మావిగన్” భావన క్రమంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తే, అది ఒక ప్రాంతీయ ఉద్యమంగా మారే అవకాశాన్ని కూడా విస్మరించలేము.
రాబోయే రోజుల్లో జగన్ చేపట్టే పాదయాత్రలో ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో అమరావతిలో గణనీయమైన పురోగతి చూపించలేకపోతే, ఈ “మావిగన్” స్ట్రాటజీ వారికి గండంగా మారే అవకాశముంది.
మొత్తానికి చూస్తేఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఒక కొత్త నేరేటివ్ రూపుదిద్దుకుంటోంది. అమరావతి vs మావిగన్ అనే ఈ పోరు 2029 ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమీకరణల్లో ఎవరు ముందుంటారు? ఎవరు తప్పులు చేస్తారు? అన్నదే రాబోయే రాజకీయాలను నిర్ణయించబోతోందా..? చూద్దాం ఏమి జరుగుతుందో..
ఎడిటర్
Tsr yadav