గ్రామాల్లో నీళ్లు నిల్… మద్యం ఫుల్: ఏపీ ప్రభుత్వంపై సిపిఐ ఈశ్వరయ్య ఫైర్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య వినుకొండలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కేవలం ₹500 కోట్లతో పూర్తయ్యే పల్నాడు వరికపూడిశల ప్రాజెక్టును విస్మరించి, ముఖ్యమంత్రి కేవలం ‘అమరావతి, పోలవరం’ జపమే చేయడం దారుణమన్నారు. పల్నాడు ప్రాంతంలో ఫ్లోరిన్ సమస్యతో యువత నరకం చూస్తున్నా కనీసం మంచినీటి సరఫరా చేయలేని ప్రభుత్వం.. వైన్లు, బెల్ట్ షాపులను విచ్చలవిడిగా పెంచి మద్యం ఏరులై పారిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘బాదుడే బాదుడు’ అని నాటకాలేసిన చంద్రబాబు, లోకేష్‌లు అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, 35 శాతం వ్యాట్ టాక్స్‌తో ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ప్రజలను పొదుపు చేయమంటూనే.. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు ప్రత్యేక ఫ్లైట్లలో వేరువేరుగా ప్రయాణిస్తూ గంటకు వేలాది లీటర్ల ఇంధనాన్ని, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో జనాభా పెంచాలంటూ ముగ్గురు, నలుగురు పిల్లలను కనాలని చంద్రబాబు పిలవడంపై స్పందిస్తూ.. ఉన్న యువతకే ఉద్యోగాలు లేక వలసలు పోతుంటే, పుట్టబోయే వారికి ఎలాంటి గ్యారెంటీ ఇస్తారని ప్రశ్నించారు. తాము మాత్రం ఒక్కరే సంతానాన్ని కంటూ ప్రజలకు మాయమాటలు చెప్పడం సిగ్గుమాలిన చర్య అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష లేదా కులం మారిపోవని, దళితులు క్రైస్తవంలోకి మారినంత మాత్రాన వారి కుల సర్టిఫికెట్లను రద్దు చేయడం తగదని, దళిత క్రైస్తవుల హక్కుల కోసం సిపిఐ పోరాడుతుందని స్పష్టం చేశారు. అలాగే, రాజధాని రైతులను ఆదుకోకుండా కేవలం కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్న అంశంపై సీఎం చంద్రబాబు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చివరగా, జూన్ 1 నుండి 5 వరకు కోటప్పకొండ పరిసరాల్లో AIYF ఆధ్వర్యంలో జాతీయ నాయకులు రామకృష్ణ, నారాయణల సమక్షంలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు గుజ్జుల ఈశ్వరయ్య వెల్లడించారు.