జి.ఓ.నెం.396ను రద్దు చేయాలి:
వినుకొండలో దస్తావేజు లేఖర్ల నిరసన
వినుకొండ:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణల పేరుతో విడుదల చేసిన వివాదాస్పద జి.ఓ.నెం.396పై వినుకొండ నియోజకవర్గ దస్తావేజు లేఖర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన బాట పట్టారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) విధానంలో ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (RSK)’ ద్వారా సేవలు అందించాలనే ప్రభుత్వ నిర్ణయం.. దశాబ్దాలుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న దస్తావేజు లేఖర్ల మనుగడను రోడ్డున పడేసేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
బుధవారం వినుకొండ దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో డాక్యుమెంట్ ప్రిపరేషన్ విధానంపై కనీస అవగాహన లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా కేవలం కొందరు అధికారుల నివేదికల ఆధారంగా ఈ జి.ఓ.ను తీసుకురావడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.
**నాలుగు గోడల మధ్య తీసుకున్న నిర్ణయాలతో ఉపాధి దెబ్బతీస్తున్నారు:**
ప్రభుత్వం నుండి ఎలాంటి జీతభత్యాలు ఆశించకుండా, కేవలం నామమాత్రపు సర్వీస్ ఛార్జీలతో ప్రజలకు ఎంతో నమ్మకంగా సేవలందిస్తున్న దస్తావేజు లేఖర్ల వ్యవస్థను రూపుమాపే ఆలోచనలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా ఉన్న ప్రైవేటీకరణ ఆలోచనను వ్యతిరేకిస్తూ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
**సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పణ:**
అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక సబ్ రిజిస్ట్రార్ ఎస్కే మాలిక్ షాకు అందజేశారు. ప్రభుత్వం ఈ వివాదాస్పద జి.ఓ.396ను వెనక్కి తీసుకోకపోతే ప్రాణత్యాగాలకైనా వెనుకాడబోమని, రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఈ సమావేశంలో వినుకొండ పట్టణ దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు, డి.టి.పి. ఆపరేటర్లు, వారి సహాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
**- ఎడిటర్, పొలిటికల్ టెంపర్**