ఉమా…కొంప ముంచావు కదయ్యా..!
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అంతా సజావుగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి.
విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో సదా ముందుండే ఉమా, ఈసారి సొంత పార్టీ అధినాయకత్వంపైనే పరోక్షంగా అసంతృప్తి వెళ్లగక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది.
గత ఐదేళ్ల పాటు (2019-2024) పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల, గుడివాడ వంటి ప్రాంతాల్లో దాడులు జరిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రాణాలకు తెగించి పనిచేశామని, కానీ తీరా అధికారం దక్కేసరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వారికి పెద్దపీట వేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తమ్ముళ్ల అంతర్గత అసంతృప్తిని బట్టబయలు చేశాయి.
కొలుసు పార్థసారథి సహా వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన దాదాపు 15 మంది నేతల పేర్లను ప్రస్తావిస్తూ బోండా ఉమా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి.
ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోస్తూ, కష్టకాలంలో అండగా నిలిచిన సీనియర్లను పక్కనబెట్టి, వలస నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టడం ఏంటనే ప్రశ్నను ఆయన పరోక్షంగా సంధించారు.
ఉమా పేల్చిన ఈ మాటల తూటా కేవలం ఆయన వ్యక్తిగత అసంతృప్తేనా, లేక మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ మరికొందరు సీనియర్ల గొంతుకగా మారబోతోందా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. రానున్న రోజుల్లో అసంతృప్త ఎమ్మెల్యేలు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో, చంద్రబాబు ఈ అంతర్గత సెగను ఎలా చల్లారుస్తారో అన్నది వేచి చూడాల్సిందే.