*దస్తావేజులేఖర్ల పోరాటానికి వైసీపీ సంఘీ భావం*
396 జీవోను రద్దు చేయాలి
– మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఏసి సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్
వినుకొండ : కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జివో నంబర్ 396 వల్ల దస్తావేజు లేఖర్ల ఉపాధి దెబ్బతింటోందని, ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన 10వ రోజుకు చేరుకోగా, వారి దీక్ష శిభిరం వద్దకి వెళ్లి ఆయన పూర్తీ సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వం తన జేబులు నింపుకొనే విధంగా అన్ని రంగాలను ప్రైవేటుపరం చేస్తూ, దస్తావేజు లేఖర్ల జీవితాలతో ఆటలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఉపాధి కల్పిస్తామని చెప్పి, ఉన్న ఉపాధిని దెబ్బకొట్టడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు లేఖర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ నిర్ణయం వల్ల లేఖర్లకే కాకుండా రైతులకు, ప్రజలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లపై దస్తావేజు లేఖర్లకు పూర్తి అవగాహన ఉందన్న ఆయన, ఈ వృత్తిలో ఏవైనా లోతుపాట్లు ఉంటే సరిదిద్దాలి తప్ప, వారిని పూర్తిగా లేకుంటే చేయాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ‘నీట్’ విషయంలో ఏ విధంగా జరిగిందో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 396 జీవో విషయంలోనూ అదే జరుగుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంపదను తన పార్టీ నాయకులకు ఎలా కట్టబెట్టాలా అనే అవకాశాలను అందిచే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలోని అన్ని రంగాలను దోచుకోవడానికి, తన పార్టీ నాయకులకు దోచిపెట్టడానికే ఏకైక ఎజెండాతో ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారని ఆరోపించారు. నిత్యం అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతున్న ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి లేఖర్లకు న్యాయం చేయాలని, వెంటనే తమ ప్రైవేటీకరణ ఉద్దేశాన్ని మానుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, 396 జీవోను తక్షణమే రద్దు చేయాలని బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. దస్తావేజు లేఖర్లు చేపట్టిన సమ్మెకు, సంఘీభావం తెలవడమే కాకుండా, వారి సమస్యను పరిష్కారమయ్యేలా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దస్తావేజులేఖరిలో చేపట్టిన పెన్‌డౌన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఇది దస్తావేజులు ఒక్కరి సమస్య కాదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.