*రాష్ట్రంలోని కరువు మండలాలు ప్రకటించాలి…*
సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య లేఖ
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎల్-నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వర్షాభావ మండలాలను తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. సాధారణంగా 225 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా కేవలం 104 మి.మీ. మాత్రమే కురిసిందని, రాష్ట్రవ్యాప్తంగా 56 శాతం వర్షపాతం లోటు నమోదైందని లేఖలో పేర్కొన్నారు. 26 జిల్లాల్లో 21 జిల్లాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటుండగా, 608 మండలాల్లో 249 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్‌లో 30.84 లక్షల హెక్టార్ల సాధారణ సాగుకు బదులుగా ఇప్పటివరకు కేవలం 16.35 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగిందని, వరి, పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న, టమాటా తదితర పంటలు ఎండిపోతుండగా ఉద్యాన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు.
ప్రత్యామ్నాయ పంట విత్తనాలను రైతులకు 100 శాతం ఉచితంగా పంపిణీ చేయాలని, అన్ని పంటలకు ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలని, పంటల బీమా గడువును ఆగస్టు 31 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పంట రుణాలను మాఫీ చేయడం, 50 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వడం, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడం, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి రుణాలు, సబ్సిడీలు అందించడం, సాగునీటి కాలువల పునరుద్ధరణకు రూ.10 వేల కోట్లు కేటాయించడం, బ్యాంకుల రుణ ఒత్తిడిని నిలిపివేయడం, ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించడం, పశుగ్రాసం, మంచినీటి సరఫరా కల్పించడం, వ్యవసాయ ఇన్పుట్ల ధరలు తగ్గించడం, పొగాకు రైతులకు మద్దతు నిధి, రొయ్యలకు కనీస మద్దతు ధర నిర్ణయించడం, ఎరువుల యాప్‌ను రద్దు చేయడం వంటి 14 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం అత్యవసరంగా అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తన లేఖలో కోరారు.