వినుకొండలో తీవ్ర విషాదం…
సీనియర్ టీడీపీ నాయకులు సుంకర శ్రీనివాసరావు (ఎస్సార్) గుండెపోటుతో ఆకస్మిక మృతి…
వినుకొండ: వినుకొండ పట్టణానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, నియోజకవర్గ కాపు సేవా సంఘం అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు (శీనన్న – ఎస్సార్) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. సాయంత్రం సుమారు 4:30 గంటల ప్రాంతంలో ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణవార్త తెలియగానే వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి, విషాద ఛాయలు అలముకున్నాయి.
సేవా తత్పరుడు.. పేదల ఆప్తుడు
సుంకర శ్రీనివాసరావు నిరంతరం ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చేవారు.
వంగవీటి మోహన రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, కాపు సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారు.
కాపు సేవా సంఘం అధ్యక్షుడిగా సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, పేద విద్యార్థుల చదువులకు, ఆపదలో ఉన్నవారికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరి మనన్నలు పొందారు.
మార్కెట్ వ్యాపారుల కన్నీటి పర్యంతం
ప్రస్తుతం వినుకొండ కూరగాయల మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు ఆకస్మిక మృతితో మార్కెట్ వ్యాపారులు, కార్మికులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉంటూ, మార్కెట్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే ‘శీనన్న’ లేరనే వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
మార్కెట్ వ్యాపారులు, హమాలీలు, వర్కర్లు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
పార్టీలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన సుంకర శ్రీనివాసరావు అకాల మరణం వినుకొండ పట్టణానికి, నియోజకవర్గానికి తీరని లోటని పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు పేర్కొంటూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ నివాళులు అర్పించారు.