బొల్లా బ్రహ్మనాయుడు సంచలన సవాల్..
ప్రజాబలముంటే ప్రశాంతంగా ఎన్నికలు జరపండి!
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు మాజీ ఎమ్మెల్యే బొల్లా బహిరంగ సవాల్
తనను అక్రమంగా అరెస్ట్ చేసి నరసరావుపేటకు పంపించారని ఆరోపణ
పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరిస్తున్నారని విమర్శ
సీఐ ప్రభాకర్‌రావు ఖాకీ దుస్తులు వదిలి టీడీపీ తరఫున పోటీ చేయాలని వ్యాఖ్య
అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్‌బుక్ పాలన సాగుతోందని మండిపాటు
పోలీసు యంత్రాంగంతో ప్రతిపక్షాన్ని అణచివేస్తున్నారు
పల్నాడు పొలిటికల్ బ్యూరో :
వినుకొండ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించకుండా అధికార కూటమి నాయకులు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ అదే విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
తన అరెస్టు వెనుక ఎమ్మెల్యే భయమే కారణం
మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులు గెలుస్తారనే భయంతోనే ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తనను అక్రమంగా అరెస్ట్ చేయించి నరసరావుపేటకు పంపించారని బొల్లా ఆరోపించారు. తన సొంత ఇంట్లోని బెడ్రూమ్లోకి పది మంది సీఐలు, ఎస్ఐలను పంపించి హౌస్ అరెస్ట్ పేరుతో ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు గుంటూరు, హైదరాబాద్‌లో ఇళ్లు ఉన్నట్లే తనకు వినుకొండలో సొంత ఇల్లు ఉందని, తాను ఇక్కడ ఉండకూడదా అని ప్రశ్నించారు.
సీఐ ప్రభాకర్‌రావుకు బహిరంగ సవాల్
వినుకొండ సీఐ ప్రభాకర్‌రావు వ్యవహారశైలిపై బొల్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవీ ఆంజనేయులును గెలిపించింది, బొల్లాను ఓడించింది తానేనని సీఐ చెప్పుకుంటున్నారని విమర్శించారు. అంత ఆసక్తి ఉంటే ఖాకీ దుస్తులు వదిలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి తనను ఓడించాలని సవాల్ విసిరారు. పోలీసు యూనిఫాం గౌరవాన్ని అడ్డం పెట్టుకుని జైలుకు పంపిస్తానని బెదిరించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
అభ్యర్థులను బెదిరిస్తూ పోటీ నుంచి తప్పిస్తున్నారని ఆరోపణ
బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల, శావల్యాపురం మండలాల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్లు వేస్తే సీసీ కెమెరాలు లేని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి దేహశుద్ధి చేస్తామని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. దొండపాడు తదితర గ్రామాలకు చెందిన నలుగురిని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పిన తర్వాతే వదిలిపెట్టారని ఆరోపించారు.
అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్‌బుక్ పాలన
రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని బొల్లా విమర్శించారు. ప్రతిపక్ష అభ్యర్థులపై బైండోవర్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలీసుల సహకారంతో దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. రిగ్గింగ్ కారణంగానే 69, 70, 80 శాతం ఓట్లు వచ్చాయని, ఓటింగ్ శాతం పెరిగిందంటూ అధికార పార్టీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
ప్రశాంతంగా ఎన్నికలు జరిపితే రెండు సర్పంచ్ స్థానాలు కూడా రావు
కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌పై ప్రజలకు నిజంగా గౌరవం ఉంటే తనను వినుకొండలో ఉండి ప్రచారం చేసుకోనివ్వాలని బొల్లా సవాల్ చేశారు. ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే కూటమికి కనీసం రెండు సర్పంచ్ స్థానాలు కూడా రావని వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదని, భవిష్యత్తులో ఆంజనేయులును వినుకొండ నుంచి హైదరాబాద్‌కు పంపించే రోజు వస్తుందని హెచ్చరించారు.
ఎస్పీ, కలెక్టర్ స్పందించకపోవడంపై ఆవేదన
నియోజకవర్గంలో జరుగుతున్న పోలీసుల వ్యవహారాలపై ఫిర్యాదు చేసేందుకు పల్నాడు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని బొల్లా ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులను ప్రత్యేక గదుల్లోకి తీసుకెళ్లి కొట్టాలని చట్టాల్లో ఎక్కడైనా ఉందా? అసలు చట్టాలు బతికున్నాయా? లేక భూస్థాపితం చేశారా? అని ప్రశ్నించారు.
రైతులు రాత్రుళ్లు తమ ఇళ్లలో నిద్రించలేక వేరే ఇళ్లలో తలదాచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. రైతు కుటుంబాలను రౌడీలు, గూండాల మాదిరిగా చూడటం పోలీసు వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు.
పోలీసుల జోక్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలి
నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకోవడం వల్ల గ్రామాల్లో కలహాలు చెలరేగి శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని బొల్లా హెచ్చరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుని పోలీసుల జోక్యం లేకుండా స్వేచ్ఛగా, ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.