పోలీసుల అండతోనే కూటమి గెలిచింది..!
దమ్ముంటే స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించి గెలవండి: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
పల్నాడు జిల్లా, వినుకొండ:
వినుకొండ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండ రాజకీయ వాతావరణాన్ని దిగజార్చే విధంగా దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ కేసులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
గతంలో వినుకొండలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేవని, ప్రస్తుతం నామినేషన్లు వేసేందుకు కూడా మహిళలు భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పెద్దల సహకారంతో ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలవాలి తప్ప, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, అభ్యర్థులను కొట్టడం, అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని, కౌన్సిలర్ అభ్యర్థులను గృహ నిర్బంధంలో ఉంచి గెలిచామని చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు వైఎస్సార్సీపీపై గెలిచారని, కూటమి అభ్యర్థులకు విజయాన్ని పోలీసులే అప్పగించారని వ్యాఖ్యానించారు. వినుకొండలో ప్రజలను అడిగితే వైఎస్సార్సీపీ గెలిచిందని చెబుతారని పేర్కొన్నారు.
అర్చనమూర్తిపై దాడి జరిగినప్పుడు సంబంధిత సీఐ తీసుకున్న చర్యలేమిటని, బాధ్యులను అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. సీఐ కూడా పోలింగ్ బూత్‌లలోకి వెళ్లి ఓట్లు వేశారని ఆరోపించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 99 శాతం తప్పులు చేస్తున్నారని విమర్శించారు.
నూజెండ్ల, బొల్లాపల్లి, శావల్యాపురం, వినుకొండ, ఈపూరు మండలాల్లో ఎస్ఐలు నేరుగా రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వైఎస్సార్సీపీ మద్దతు ఉన్న అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. గ్రామానికి 20 మంది పోలీసులను పంపించి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడం, పోటీలో ఉంటే తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
వేల్పూరులో గ్రామస్తులు అభివృద్ధి కోసం చర్చించుకొని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంటే పోలీసుల బెదిరింపులు ఎందుకని ప్రశ్నించారు. గ్రామ పెద్దలు పరస్పరం చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప, పోలీసుల ద్వారా భయపెట్టడం సరైన పద్ధతి కాదన్నారు.
ఉడిజర్లకు చెందిన అంకిరెడ్డి అనే రైతు ఇంట్లో ఉన్న ఆరు బస్తాల ధాన్యాన్ని సీజ్ చేయడం ఏమిటని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. శాంతిభద్రతల పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై బైండోవర్ కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు.
బ్రిటిష్ పాలనలో జరిగిన దౌర్జన్యాల కంటే కూటమి పాలనలో పోలీసుల దౌర్జన్యాలు వంద రెట్లు ఎక్కువగా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రక్షకులే భక్షకులుగా మారితే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ పరిణామాలను గమనించాలని, పేదలు, బడుగు బలహీన వర్గాలపై పోలీసుల వేధింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
తనకే మాజీ ఎమ్మెల్యేగా రక్షణ లేదని, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాత్రివేళల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి బెదిరించడం, కర్రలతో దాడులు చేయడం ఆపాలని హెచ్చరించారు. పోలీసుల బెదిరింపులు ఆగకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతానని స్పష్టం చేశారు.
దమ్ముంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి గెలవాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు.
—