స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజా మద్దతు..
వినుకొండను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుతాం: జీవీ ఆంజనేయులు
పల్నాడు జిల్లా, వినుకొండ:
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీ కూటమికి పట్టం కట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు.
వినుకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికలతో పోలిస్తే కూటమి ఓటు శాతం 3.6 శాతం పెరిగిందని, వైసీపీకి 6 శాతం ఓట్లు తగ్గాయని పేర్కొన్నారు. రెండేళ్ల కూటమి పాలనకు ప్రజాతీర్పు అద్దం పడుతోందని, రాష్ట్రంలో మరోసారి కూటమి ప్రభుత్వం కొనసాగాలని ప్రజలు తమ ఓటు ద్వారా ఆకాంక్షించారని అన్నారు. రాష్ట్రంలో, పల్నాడు జిల్లాలో కూటమికి మద్దతు తెలిపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ పట్టణంలో కూటమి సాధించిన విజయంతో పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, వినుకొండను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ప్రకటించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి మద్దతుదారులకు ప్రజలు అండగా నిలుస్తారని, 95 శాతం పంచాయతీలను కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందిస్తామని, బీసీలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తోందని తెలిపారు. పల్నాడు జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన పుచ్చకాయల రమాదేవికి కేటాయించడం ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల హింసకు వైసీపీ, జగన్ కారణమని ఆరోపిస్తూ, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుపై చేసిన విమర్శలను ఖండించారు. షర్మిల తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానిస్తే వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, కూటమిలో రెబల్ అభ్యర్థుల పోటీ పార్టీ క్రమశిక్షణకు, ఐక్యతకు విఘాతం కలిగిస్తోందని, కూటమి అధికారికంగా బలపరిచిన అభ్యర్థులకే నాయకులు, కార్యకర్తలు మద్దతు ఇవ్వాలని సూచించారు. రెబల్ అభ్యర్థులపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేనకు అవకాశం ఇచ్చిన స్థానాల్లో టీడీపీ పోటీ చేయకుండా కూటమి సమన్వయంతో ముందుకు సాగాలని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
సమావేశంలో వినుకొండ మున్సిపల్ చైర్మన్ షమీంఖాన్, వైస్ చైర్మన్ పెనుగొండ శ్రీనివాసరావు, జనసేన ఇంచార్జ్ రాయల శ్రీనివాసరావు, బిజెపి నాయకులు సుధాకర్, పట్టణ టిడిపి అధ్యక్షులు బి. రోశయ్య పాల్గొన్నారు.