ఎన్నికల కమిషనర్, డీజీపీకి వైసీపీ లీగల్ నోటీసులు
సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలని డిమాండ్
నామినేషన్ల అడ్డగింతలపై ఫిర్యాదులు పరిశీలించాలని ఈసీకి సూచన
ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలు కాపాడాలని స్పష్టీకరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ), డీజీపీ సహా పలువురు ఉన్నతాధికారులకు లీగల్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మెహఫూజ్ నజ్కీ ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అక్టోబర్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నోటీసుల్లో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని అధికారులకు సూచించింది. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు యంత్రాంగం శాంతిభద్రతలను కాపాడాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ తన లీగల్ నోటీసుల ద్వారా కోరింది.