పోలీసుల బెదిరింపులతో స్థానిక ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారు – మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
వినుకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు, సర్పంచ్ అభ్యర్థులను పోలీసులు బెదిరిస్తూ పోటీ నుంచి తప్పుకునేలా ఒత్తిడి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. వైసీపీ మద్దతుదారులు ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలని, వైసిపి బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని, జగన్‌ను బలపర్చాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవాలకు అంగీకరించిన పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం సీఐలు, పోలీసులు స్టేషన్లకు పిలిపించి రాజీ పడకపోతే గంజాయి, మత్తు పదార్థాల కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని విమర్శించారు. పెదకంచర్ల వైసీపీ సర్పంచ్ అభ్యర్థి ఒంటెరు ఆంజనేయులును మధ్యాహ్నం స్టేషన్‌కు పిలిచి అర్ధరాత్రి 2 గంటల వరకు ఉంచారని, ఉడిజర్లలో సీఐ బ్రహ్మయ్య బలవంతపు ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఎంపీ నుంచి తమపై ఒత్తిడి ఉందని పోలీసులే చెప్పడం దారుణమన్నారు. కొప్పుకొండ, గుండేపల్లి, ఉడిజర్ల, పెదకంచర్ల, బొమ్మరాజుపల్లి, జంగాలపల్లి, నాగులవరం, ఏనుగుపాలెం, పిట్టంబండ, కోటప్పనగర్ తదితర గ్రామాల్లో వైసీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. దొండపాడు, తిమ్మాపురం, అయ్యన్నపాలెం గ్రామాల్లోనూ అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకునేలా ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. ఈపూరు మండలం శ్రీనగర్‌లోని పోలింగ్ కేంద్రాన్ని అంగలూరుకు మార్చే ప్రయత్నాల వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ, ఎన్నికలకు ముందు రోజు ఇలాంటి చర్యలు తగవన్నారు. 119 పంచాయతీల్లో 36 ఏకగ్రీవాలు కావడంపై కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేయడం తప్పా? అని ప్రశ్నించారు. బ్రిటిష్ పాలన కంటే కూటమి పాలన దారుణంగా ఉందని, ప్రజల మద్దతు లేక ఓటమి భయంతో పోలీసుల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు ఒక పార్టీకి కొమ్ముకాయకుండా ప్రజలందరినీ సమానంగా చూడాలని, ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. వైసీపీ నాయకులపై బైండోవర్ కేసులు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా వెనక్కి తగ్గకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు తన ఓటును తానే వేయాలని, ఇతరులు తమ ఓటును వేయకుండా జాగ్రత్తపడాలని, భయపడకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని బొల్లా బ్రహ్మనాయుడు కోరారు.