వినుకొండ: అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌లో వినుకొండ పురపాలక సంఘానికి ప్రాతినిధ్యం లభించింది. ముంబైలో నవంబర్ 25 నుంచి 27 వరకు నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు వినుకొండ మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ హాజరయ్యారు.
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (AIILSG) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. దేశవిదేశాలకు చెందిన మేయర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పట్టణాభివృద్ధి నిపుణులు పాల్గొంటున్న ఈ వేదికపై పట్టణ పారిశుధ్యం, స్వచ్ఛత కార్యక్రమాలు, స్థానిక సంస్థల పాలన, భవిష్యత్ నగరాల రూపకల్పన వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అమలవుతున్న ఆధునిక పారిశుధ్య విధానాలు, వివిధ నగరాల అనుభవాలు, ఉత్తమ నిర్వహణ పద్ధతులను తెలుసుకునే అవకాశం వినుకొండ మున్సిపాలిటీకి లభించింది.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మినేని పట్టాభిరామ్, ఐఏఎస్ అధికారులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
వినుకొండ మున్సిపాలిటీ అధికారి అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావడం పట్టణానికి లభించిన ప్రత్యేక ప్రాతినిధ్యంగా నిలిచింది.