
చంద్రబాబు నాయుడు సంపద సష్టిస్తామని చెప్పారని, అయితే సంపద సృష్టి కనిపించకపోగా కూటమి పాలనలో అప్పులు భారీగా పెరిగాయని ధ్వజమెత్తారు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. తన నివాసంలో విలేఖరుల సమావేశంలో జగన్ మాట్లాడారు.
జగన్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు ఇలా….
రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న ఆర్థిక విధ్వంసాన్ని కాగ్ కళ్లకు కట్టినట్టు చూపించింది. చంద్రబాబుగారి కూటమి హయాంలో రెవిన్యూలోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే, రాష్ట్రానికి రాబడులు తగ్గాయి. 2023-24తో పోలిస్తే 2024-25 నాటికే లోటు దాదాపుగా 56% పెరిగింది. ఏకంగా 30% పెరిగింది. అయినా సరే, మొదటి ఏడాది సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టి, పాత స్కీములన్నీ రద్దుచేసి, దారుణంగా మోసంచేశారు. దిగ్విజయంగా, ఇప్పటికీ కూడా, వారి మోసాలను కొనసాగిస్తూనే ఉన్నారు. 2025-26లో ద్రవ్యలోటు మొదటి 10నెలల కాలానికే 39.74%కి చేరుకుంది. ఖర్చులకోసం అప్పులు మీద ఆధారపడే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఆర్థిక వ్యవస్థను నడిపించే విషయంలో చంద్రబాబుగారి విధ్వంసకర రికార్డులకు సాక్ష్యాలు ఇవి అంటూ జగన్ ధ్వజమెత్తారు.
చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయింది…
2014-19 మధ్య అనుమతించిన దానికన్నా, ఆ ఐదేళ్లలో రూ.29,099 కోట్లు అధికంగా అప్పులు తెచ్చారని జగన్ విమర్శించారు. 2019-24 పరిమితికి కంటే రూ.12,708 కోట్లు తక్కువగానే మేము అప్పులు చేశామని, చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే మళ్లీ సీన్ రివర్స్ అయిందని జగన్ విమర్శి:చారు. 2024-25లోనే పరిమితికి మించి రూ.17,953కోట్లు అధికంగా అప్పులు తీసుకువచ్చారు: ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి ఇంతకన్నా కూడా ఘోరంగా ఉంది.ఈ రెండేళ్లలో చంద్రబాబు తెచ్చిన మొత్తం అప్పులు రూ.3.2లక్షల కోట్లుగా ఉందని, మేము ఐదేళ్ళలో చేసిన అప్పుల్లో 96% అప్పులు ఈ రెండేళ్లలోనే చంద్రబాబు చేశారు. మా ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు కేవలం 3.31 లక్షల కోట్లు మాత్రమే. ఎవరు జాగ్రత్తగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించారు, ఎవరు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారన్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.