
మన దేశం యుద్ధంలో ప్రత్యక్షంగా , పరోక్షంగా పాల్గొనకపోయినా ఇరాన్`ఇజ్రాయేల్ యుద్ధ ప్రభావం మాత్రం దేశంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గల్ఫ్‌దేశాల్లో యుద్ధ వాతావరణం, ఇరాన్ దాడులు నేపధ్యంలో ఆయిల్రీఫైనరీలు, చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఇప్పటిలో ఆయా దేశాలు కోలుకొనే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం ముందస్తుగా నిబంధనలు కఠినతరం చేసింది. గ్యాస్ ధరలు పెంచటంతోపాటు 21 రోజుల నుండి 25 రోజులకు సిలిండర్ బుకింగ్ గడువు పెంచింది. రష్యానుంచి పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నప్పటికీ దేశంలో యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. కేంద్రం పుకార్లు నమ్మెద్దని చెప్తున్నప్పటికీ వాస్తవంలో పలు కీలకాంశాలు వెలుగుచూస్తున్నాయి. యుద్ధ నేపధ్యంలో జార్ఖండ్, పంజాబ్, గుజరాత్, తమిళనాడు తోపాటు ఆయా రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో హోటల్స్ , తినుబండారాల దుకాణాలు, హాస్టల్స్ మూతబడుతున్నాయి. హైదరాబాద్, ముంబైతోపాటు పలు ప్రముఖ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అస్సాంలో ఏకంగా గ్యాస్ ధరల పెంపుపై ఆందోళనలు కూడా మొదలయ్యాయి. ఒడిస్సాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పంజాబ్‌లో పెళ్లి మండపాలపై కూడా ఎఫెక్టు పడినట్లు మీడియాలో కథనాలొస్తున్నాయి. కేరళలో హోటల్స్ మూసివేసేందుకు వ్యాపారులు సిద్ధమౌతున్నట్లు సమాచారం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఉత్పత్తి పెంచకపోతో ఆ ప్రభావం హోటల్స్ , కళ్యాణమండపాలు, క్యాటరింగ్, హాస్టల్స్ వంటి రంగాలపై పడి వారు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్‌లో ఏ ప్రభావం ఉంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ నేపధ్యంలో కేంద్రం రంగంలోకి దిగి రాష్ట్రాల వారీగా గ్యాస్ నిర్వహణ, నిల్వలపై దష్టిసారించి డొమెస్టిక్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని, కమర్షియల్ సిలిండర్లు ఉత్పత్తి మరింతగా పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.