
హనుమంతుడి ముందే కుప్పిగంతులా...?
నా ముందు మీ ఆటలు సాగవు
మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా
పనిచేయకుంటే ఇక అంతే సంగతులు…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పరిగెడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలను పరిగెట్టిస్తుంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత బాగా పనిచేసే అధికారులు కూడా అంత బాగా పనిచేస్తారని, అప్పుడే పనులు త్వరగా పూర్తవుతాయని ప్రజా సమస్యలుగానీ, అభివద్ధి పనులుగానీ వేగం పుంజుకుంటాయన్నది చంద్రబాబు వాదన. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరుతో చంద్రబాబు నాయుడు కొంత అయిష్టంగా ఉన్నట్లు సమాచారం. అందుకే మంత్రులకు ఏప్రిల్ 2న ర్యాంకులు ఇస్తానని, తమ పనితీరు మార్చుకోకుంటే ఇర కూటమి అధికారంలోకొచ్చి రెండేళ్ళు పూర్తయిన తదుపరి అంటే సరిగ్గా జూన్, జూలై నాటికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పరోక్షంగా సంకేతాలిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఓ వైపు ఢిల్లీలో మారుతున్న రాజకీయ పరిణామాలు, మరోవైపు చంద్రబాబు నాయుడు హెచ్చరికలు చూస్తే మంత్రులకు వింత అనుభూతులు ఎదురవుతున్నాయని సమాచారం.
కూటమి అధికారం చేపట్టే సమయంలోనే మంత్రి పదవులు తీసుకున్న వారంతా బాగా పనిచేయాలి.. నేను మీ పనితీరును పరిశీలిస్తాను, పనితీరు బాగోలేకపోతే రెండేళ్ళ తరువాత పనితీరు ఆధారంగా మార్పులు చేస్తాను, కొత్త వారికి అవకాశం కల్పిస్తాను అంటూ హెచ్చరించారు. తొలి ఏడాది మంత్రులు కొంత ఉత్సాహంగా ఉన్నా ప్రతిపక్షం యాక్టివ్ అయ్యాక , ప్రతిపక్ష విమర్శలను మంత్రులు తిప్పికొట్టలేకపోతున్నారన్న వాదన ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు తాజాగా మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో చిట్ చాట్లో మరో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అంటూ మంత్రులకు చెప్పారట. మంత్రులు కేవలం తమ నియోజకవర్గాల్లోమాత్రమే కాదు తాము ఇన్ఛార్జిలుగా ఉన్న జిల్లాల్లో సంపూర్ణ విజయం సాధించాలి అప్పుడు మీ పనితీరు బాగున్నట్లుగా భావిస్తా అని చెప్పారట. స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించుకోవటం ఎంత ముఖ్యమంత్రులకు బాగానే అర్ధమైందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఇక వారికి మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సినట్లే కనిపిస్తుంది. ఓ వైపు ప్రతిపక్షం పూర్తిగా యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నందున మంత్రులు కూడా మరింత దూకుడు పెంచాలని చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారు. పలు మార్లు నివేదికలు, మంత్రుల సొంత నియోజకవర్గాల్లో పరిస్థితులు, ఇన్ఛార్జి మంత్రులుగా జిల్లాలో ప్రభావం, తాము నిర్వహిస్తున్న శాఖలలో ఫైళ్ళ క్లియరెన్స్ ఇలాంటి అంశాల వారీగా మంత్రుల చిట్టా చంద్రబాబు వద్ద ఉండటంతో మంత్రులంతా సీఎం చెప్పిన మాటకు తలూపటమే కానీ తిరిగి సమాధానం చెప్పుకొనే పరిస్థితి లేకపోయిందట. తాము ఏం చెప్పాలన్నా సీఎం గారి వద్ద గణాంకాలతో సహా ఉన్నాయని తెలుసుకున్న మంత్రులు ఇక లాభం లేదు… స్థానిక ఎన్నికలపై దష్టి పెట్టాల్సిందే అన్న భావనకు వచ్చారట. చూద్దాం… చంద్రబాబు నాయుడు ఆదేశాలు మంత్రుల్లో ఎంత మార్పు తెస్తుందో. మంత్రులు స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించకపోతే మాత్రం వారి స్థానంలో కొత్త వారికి మంత్రులుగా అవకాశం ఇవ్వటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.