నివేదిక కోరిన అధిష్టానం…
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణలోని మొయినాబాద్ ప్రాంతం గెస్ట్ హౌస్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పేరు వెలుగులోకి రావడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది.
ఈ అంశంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పల్లా శ్రీనివాస రావు కు ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంపీపై వచ్చిన ఆరోపణలను సీఎం చాలా సీరియస్‌గా తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్‌కు అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఘటనపై ఆయనకు నోటీసులు జారీ చేయాలని కూడా పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించబోమని సీఎం స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వ్యక్తులు లేదా నేతల వ్యక్తిగత బలహీనతల కారణంగా పార్టీకి నష్టం కలగకూడదని కూడా చంద్రబాబు హెచ్చరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీ పుట్టా మహేష్‌కు తీసిన రక్త నమూనాల్లో డ్రగ్స్ వినియోగించినట్లు తేలిందని పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం చర్యలకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పుట్టా కుటుంబం చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతోంది. ఆర్థికంగా బలమైన కుటుంబం కావడంతో పాటు బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నాయకత్వంగా పుట్టా కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. గతంలో పుట్టా సుధాకర్ యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కూడా నియమించారు. మొన్నటి ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్‌కు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. దశాబ్దాలుగా ఏలూరు పార్లమెంట్ సీటు ఒకే సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తూ వచ్చినప్పటికీ, ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వడం ద్వారా పుట్టా కుటుంబాన్ని పార్టీ గౌరవించింది. తెలంగాణలోని మొయినాబాద్ ప్రాంతంలో ఉన్న ఒక గెస్ట్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొంతమంది ప్రముఖులతో పాటు పుట్టా మహేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తనపై నమోదైన కేసులో ఎంపీ మహేష్ కోర్టును ఆశ్రయించారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరగా, న్యాయస్థానం షరతులతో బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా పరిశీలిస్తోంది. బాధ్యత గల ఎంపీ స్థాయిలో ఉండి డ్రగ్స్ వంటి వ్యవహారాల్లో పేరు రావడం పార్టీకి ఇబ్బందికరమని భావిస్తున్న అధిష్టానం, తదుపరి చర్యలపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేగా తండ్రి…ఎంపీగా కుమారుడు…

పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిడిపి తరఫున పోటీ చేసి వైసిపి అభ్యర్థి శెట్టిపల్లె రఘురామిరెడ్డిపై 21,249 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన కుమారుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ టిడిపి తరఫున పోటీ చేసి వైసిపి అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్‌పైన 1,80,000 ఓట్ల అత్యధిక భారీ మెజార్టీతో విజయం సాధించారు.