ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక భేటీపై ఆసక్తి నెలకొంది. ఐతేవలే ఇరువురు నేతలు దీర్ఘంగా భేటీ అయ్యారు. తాజాగా మరో మారు పవన్ కళ్యాణ్ బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలవనుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే వ్యూహాలు, అలాగే రాష్ట్ర–కేంద్ర సంబంధాలు, కేంద్రం తాజా నిర్ణయాలపై ఇద్దరూ కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం.
ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడటానికి ప్రధాన కారణం, సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశముండటమే. కేంద్ర నాయకత్వంతో సమావేశాల ముందు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలు, ఆర్థిక సహాయం, ప్రాజెక్టుల ఆమోదం వంటి విషయాలు ఢిల్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక రాజకీయంగా చూస్తే, ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ భేటీకి ప్రాధాన్యం పెరిగింది. జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ పాత్రపై కూడా చర్చ జరిగే అవకాశముంది. కూటమి పొత్తు నేపథ్యంలో పవన్ ని ప్రచారానికి వినియోగించాలనే ఆలోచనలపై కూడా బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి మార్పుతో ఏపీలోనూ కీలక రాజకీయ పరిణామాలు చేసుకుంటాయి అన్న ప్రచారం నడుస్తున్న సమయంలో ఇరువురి నాయకుల భేటీ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఇదే సమయంలో జనసేన వర్గాల్లో మరో హాట్ టాపిక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబును రాజ్యసభకు పంపే అంశంపై చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక క్లారిటీ లేకపోయినా, ఈ భేటీలో ఆ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక మరో ఆసక్తికర అంశం కూడా ఈ భేటీలో చర్చకు రావొచ్చని టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల సందర్బంగా, ఉగాది పండుగ దృష్ట్యా తన ఇంటికి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించనున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తంగా చూస్తే, ఈ భేటీ కేవలం సాధారణ సమావేశం కాదని, రాష్ట్ర రాజకీయాల్లో తదుపరి అడుగులపై స్పష్టత వచ్చే మీటింగ్‌గా భావిస్తున్నారు. ఢిల్లీలో ఏం జరగబోతోంది? ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై ఎలా పడబోతోంది? అన్నదానిపై ఈ సమావేశం తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.