
2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పరిమితంగా మాత్రమే మీడియా ముందుకొచ్చిన జగన్, ఇప్పుడు తరచూ ప్రజలతో, మీడియాతో మాట్లాడుతున్న తీరు వెనుక వ్యూహం ఉందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
పార్టీని పూర్తిగా “డిఫెన్సివ్ మోడ్”లో పెట్టకుండా, చిన్నగా పార్టీ ని, నాయకుల్ని యాక్టివ్‌గ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఒక్కో అంశంపై క్రమంగా స్పందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద ర్యాలీలు, భారీ కార్యక్రమాల కంటే—ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ద్వారా ప్రజల్లో చర్చ కొనసాగించే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల టీటీడీ లడ్డు వివాదం, బి .ఆర్ . నాయుడు పై విమర్శలు, అలాగే ఇతర రాజకీయ పరిణామాలపై వైసీపీ వేగంగా స్పందించడం చూస్తే ప్రతి చిన్న అంశాన్నీ రాజకీయంగా వినియోగించుకుని పార్టీని గ్రౌండ్లో యాక్టివ్‌గా ఉంచాలనే స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తోంది.
మరో కోణంలో చూస్తే, ఇది “నష్టాన్ని నియంత్రించుకునే” దశ కూడా కావచ్చు. భారీ ఓటమి తర్వాత క్యాడర్లో నిస్సత్తువ రాకుండా, నాయకత్వం కనిపిస్తూ ఉండాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తరచూ మీడియా ముందుకు వచ్చి, పార్టీ లైన్‌ను క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు.
అయితే ఇది పూర్తి స్థాయి అటాక్ మోడ్ కాదు. ఒకవైపు విమర్శలు చేస్తూనే, మరోవైపు పార్టీని తిరిగి పునర్వ్యవస్థీకరించుకునే ప్రయత్నం కూడా కొనసాగుతోంది. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా గ్రామ స్థాయి వరకు పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే ఈ తరహా కమ్యూనికేషన్ అవసరమని వైసీపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
సరళంగా చెప్పాలంటే జగన్ ఇప్పుడు “లో ప్రొఫైల్ కంట్రోల్ + హై ఫ్రీక్వెన్సీ రియాక్షన్” మోడల్లో రాజకీయాలు చేస్తున్నారు. ఇది తాత్కాలిక వ్యూహమా, లేక దీర్ఘకాల ప్లానా అన్నది వచ్చే ఎన్నికల వరకు స్పష్టమవుతుంది. B.R. నాయుడు పై వైసీపీ తీవ్ర స్థాయిలో దాడి ప్రారంభించింది. టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న నాయుడు తప్పు చేసినా ప్రభుత్వం కాపాడవచ్చేమో కానీ రాష్ట్రంలోని మహిళలు మాత్రం ఊరుకోరని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఊరూరా, వాడవాడలా మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడతారని తీవ్ర హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఇటీవల టీటీడీ లడ్డూ వివాదం చుట్టూ రాజకీయాలు ముదిరిన వేళ, ఇప్పుడు అదే ఇష్యూపై వైసీపీ తన ఫోకస్‌ను B.R. నాయుడు పై కేంద్రీకరించింది. ప్రభుత్వం, కూటమి లడ్డూ కల్తీ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఉన్న సమయంలో, వైసీపీ మాత్రం ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఇదే సమయంలో అంబటి అరెస్ట్ అంశాన్ని కూడా రాజకీయంగా వినియోగిస్తూ అధికార పార్టీపైన ఒత్తిడి పెంచుతోంది.
మరోవైపు, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్
డ్రగ్స్ కేసులో ఇరుక్కో వడం కూడా వైసీపీకి మరో ఆయుధంగా మారింది. గతంలో మహేష్ తండ్రి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన అక్రమాల ఫలితంగానే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ రెండు అంశాలను కలిపి వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
ఒకవైపు బి .ఆర్ . నాయుడు , మరోవైపు పుట్టా మహేష్ లని టార్గెట్ చేస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కాయి. అన్ని జిల్లాల్లో నిరసనలు చేపడుతూ తమ పోరాటాన్ని ప్రారంభించాయి. ఈ నిరసనల ద్వారా అధికార పార్టీపై మరింత ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, గ్రామ స్థాయి వరకు పార్టీ కార్యకలాపాలను యాక్టివ్ చేయాలని వైసీపీ నాయకత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశాన్ని రాజకీయంగా మలుచుకుంటూ, వచ్చిన ప్రతి అవకాశాన్ని వైసీపీ సద్వినియోగం చేసుకుంటోంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.