కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య – జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. వై . ఎస్ . షర్మిల తన అన్న వై ఎస్ జగన్ పై యిలో విమర్శలు గుప్పిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్య కేసు కడప ఎంపీ టికెట్‌కే సంబంధించిందని షర్మిల ఆరోపించారు. తనతో వ్యక్తిగతంగా మాట్లాడిన సమయంలో వై . ఎస్ . వివేకానంద రెడ్డి అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకూడదని స్పష్టంగా చెప్పారని తెలిపారు. అయితే వివేకా అభ్యంతరాలను పట్టించుకోకుండా జగన్ కడప ఎంపీ టికెట్‌ను అవినాష్ రెడ్డి కే ఇచ్చారని విమర్శించారు.
వివేకా బతికి ఉంటే తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగా మారతారని భావించి అవినాష్‌రెడ్డి హత్యకు పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. ఈ కేసులో బాధితుల పక్షాన నిలబడాల్సిన జగన్, నిందితుల పక్షాన నిలబడ్డారని తీవ్రంగా మండిపడ్డారు. “ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు… అన్న అనే పదానికి కళంకం జగన్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో కూడా షర్మిల తరచూ జగన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా వివిధ అంశాలపై ఆయనపై విమర్శలు గుప్పిస్తూ, తన స్వరాన్ని మరింత ఘాటుగా వినిపిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతను మరింత పెంచుతుందన్న వాదన వినిపిస్తుంది.
