వినుకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రజలను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క రైతుని కూడా ఆదుకోలేదని ప్రశ్నించిన జీవీ ఆంజనేయులు, రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి డబ్బులు చెల్లించలేదని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో వైసీపీ నాయకుడు బొల్లా బ్రహ్మ నాయుడు ముందుంటారని వ్యాఖ్యానించారు. “మీరు నీతులు చెప్పడం దొంగే దొంగ అన్నట్టుంది” అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మొక్కజొన్న రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులకు అవసరమైన మద్దతు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా, పల్నాడు జిల్లాలో 50 వేల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని జీవీ తెలిపారు. వైసీపీ హయాంలో రైతులకు జరిగిన నష్టాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాకు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల పాటు వైసీపీ అసత్య ప్రచారాలను విని ప్రజలు తగిన సమాధానం ఇచ్చారని జీవీ ఆంజనేయులు అన్నారు. కార్యక్రమం లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొంకూరి రోశయ్య , టీడీపీ నాయకులు పెమ్మసాని నాగేశ్వరావు, పీవీ సురేష్, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
యువగళం హామీలు నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం…
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రభుత్వం జీవి ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడారు. ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఉన్నత విద్య విభాగంలో 1500 పోస్టులు, గ్రూప్-1, గ్రూప్-2, హోమ్ శాఖ, పాఠశాల మరియు ఇంటర్ విద్య శాఖల ద్వారా మొత్తం 10,060 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోందని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు నారా లోకేష్ చెప్పిన విధంగా ఇప్పటికే 6,25,300 ఉద్యోగాలు కల్పించామని జీవీ ఆంజనేయులు తెలిపారు. అదేవిధంగా మెగా డీఎస్సీ ద్వారా 16,500 పోస్టులను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి దావోస్లో జరిగిన పెట్టుబడుల సదస్సులో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సమిష్టిగా కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం రూ.9.70 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ను దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం, రంజాన్ పండుగల శుభాకాంక్షలను ప్రజలకు తెలియజేశారు.