టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై భూమన ఘాటు విమర్శలు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన, అన్నప్రసాద కేంద్రం పరిశీలన ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎంతో పాటు ఇతర నేతలు, అధికారులు పర్యటనలో పాల్గొన్నా, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అత్యంత ఘాటుగా స్పందించారు. “ముఖ్యమంత్రి వచ్చారు కానీ, చైర్మన్ ఏరీ?” అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.
భూమన ఘాటు విమర్శలు..
భూమన కరుణాకర్ రెడ్డి తన విమర్శలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు ఇద్దరినీ తూర్పారబట్టారు. వారిద్దరూ శ్రీవారి సాక్షిగా నాటకాలాడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ నాయుడును దూరంగా ఉంచినట్లు చంద్రబాబు నటించారని, కార్యకర్తలతో కూడా ఆయనను పట్టించుకోవద్దని చెప్పడం వీరి డ్రామాలో భాగమని భూమన విమర్శించారు.బీఆర్ నాయుడుది కల్మష స్వభావం. నీతిమాలిన ప్రవర్తనతో ఉన్న ఆయనకు అటెండర్లు కూడా గౌరవం ఇవ్వని పరిస్థితి ఉంది. బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తీసేయాలి. అప్పుడే దేవాలయ ప్రతిష్ఠ కాపాడబడుతుంది.
“వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు”…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ కార్యకలాపాలపై సమీక్షలు జరిపినప్పుడు, అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి ఆహారాన్ని రుచి చూసినప్పుడు కూడా చైర్మన్ బి.ఆర్. నాయుడు పక్కన లేకపోవడం వెనుక పెద్ద వ్యూహం ఉందని భూమన అభివర్ణించారు. “వీధిలో ఉండలేడు, ఇంట్లోకి రానివ్వరు” అన్నట్లుగా బీఆర్ నాయుడు పరిస్థితి మారిందని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో లేని పదవిని పట్టుకుని వేలాడటం అవసరమా అని ప్రశ్నించారు.

